హైదరాబాద్: శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ విభాగాలు సహా వివిధ శాఖల అధికారులను విచారించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ శాఖలతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను ఏసీబీ అధికారులు విచారించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని చిన్నపాటి అక్రమాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అయితే తనిఖీల సమయంలో ఎటువంటి నగదు లభించలేదని, పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
