గోదావరిఖని‌‌‌‌‌‌‌లో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని‌‌‌‌‌‌‌లో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి 137వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాల్లోని జీఎం ఆఫీసుల ఆవరణలో నిర్వహించారు. గోదావరిఖని ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జీఎం లలిత్​ కుమార్​, యైటింక్లయిన్​ కాలనీలో జీఎం వెంకటయ్య సింగరేణి జెండాను ఎగరేసి గౌరవ వందనం చేశారు. అనంతరం కేక్​ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులు దొంత వెంకటేశ్వర్లు, మిర్యాల అశోక్​ రావు, తిప్పర్తి నాగేశ్వరరావు, ఎం.రంజాన్​మియాను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు.

 చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జీఎంలు మాట్లాడుతూ సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ రంగంలో రాణిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సేవా అధ్యక్షురాలు అనిత, క్వాలిటీ జీఎం ముజుందార్, ఎస్‌‌‌‌‌‌‌‌వోటూ జీఎం చంద్రశేఖర్​, ఆఫీసర్లు, కార్మికులు పాల్గొన్నారు.

 కాగా సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించకుండా కేవలం జీఎం ఆఫీసులకే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బొగ్గు గనులపై లీడర్లు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించారు. సింగరేణి డే వేడుకలను బహిష్కరించారు.