వెలుగు, న్యూస్‌నెట్‌వర్క్:ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్జిల్లాల్లో గ్యాస్‌కొరత లేదని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లను అందజేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పౌరసరఫరా, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉంటే 1800-425-1939 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిల్వలను అందుబాటులో ఉంచినట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత పేర్కొన్నారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా ప్రత్యేక మానిటరింగ్ కమిటీ నియమించినట్లు చెప్పారు. ప్రజలు ముందస్తు బుకింగ్ లు చేయవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఫిర్యాదు చేయడానికి 8500844365 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. సర్కార్ స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్లు, అనాథ ఆశ్రమాలకు ఇండెంట్అందిన వెంటనే సిలిండర్లు సప్లయ్ చేయాలని నిజామాబాద్కలెక్టర్ఇలా త్రిపాఠి ఆదేశించారు.
సింగిల్ సిలిండర్ వినియోగదారులు 25 రోజులకు, డబుల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు 45 రోజుల గడువుతో ఆన్లైన్లో రీఫిల్ బుకింగ్ చేసుకొని డెలివరీ బాయ్ నుంచే అందుకోవాలని గోదామ్ల వద్దకు వెళ్లొద్దన్నారు. శుక్రవారం ఆమె నిత్యవసర వస్తువుల పర్యవేక్షక కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. బుకింగ్ చేసిన నాలుగు రోజుల్లో సిలిండర్లు ఇళ్ల వద్దకు చేరుతాయని పుకార్లు నమ్మి ఆందోళన చెందవద్దన్నారు.
ఎక్కడైనా సమస్య ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గ్యాస్ఏజెన్సీలకు సూచించారు. జిల్లా స్థాయిలో ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు.
కరీంనగర్జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో గ్యాస్ సరఫరాపై పోలీసు సివిల్ సప్లై, రవాణా, విద్య ఆరోగ్య శాఖతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చైర్మన్‌గా, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కన్వీనర్‌గా 12మంది సభ్యులతో జిల్లాలో గ్యాస్ సరఫరాపై సమీక్షించేందుకు డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నట్లు, యథావిధిగానే సరఫరా జరుగుతుందని వివరించారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 91542 49727లో సంప్రదించవచ్చని తెలిపారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై కలెక్టరేట్‌లో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
