లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపల్లి కొనతండాకు చెందిన గిరిజన రైతు దేవసోత్ శ్రీహరి(53) సోమవారం రాత్రి లింగంపేట పెద్దవాగులో గల్లంతయ్యాడు. తండా సర్పంచ్ రుక్కీసేవ్యానాయక్వివరాల ప్రకారం.. పెద్దవాగు సమీపంలోని తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువులు, ఎడ్లబండిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన శ్రీహరి మంగళవారం ఉదయం వరకు తిరిగిరాలేదన్నారు.
శ్రీహరి ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైనట్లు కుటుంబసభ్యులు, తండావాసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, లింగంపేట మండల ప్రత్యేకాధికారి సురేందర్, తహసీల్దార్ సురేశ్కలిసి తండాకు చేరుకొని శ్రీహరి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వాగులో ఉధృతి తగ్గిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
