కామారెడ్డిలో కుండపోత..జిల్లా కేంద్రంలో 18 సెం.మీ. వర్షపాతం నమోదు

కామారెడ్డిలో కుండపోత..జిల్లా కేంద్రంలో 18 సెం.మీ. వర్షపాతం నమోదు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇండ్లలోకి చేరిన వరద నీరు  
  • రామారెడ్డి రోడ్డులో వరద నీటిలో చిక్కుకున్న పెండ్లి బృందం
  • లింగంపేట మండలంలో కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన.. ఒకరి గల్లంతు
  • పొంగి ప్రవహిస్తున్న వాగులు.. నిండిన పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వాన కురిసింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. టీచర్స్​కాలనీ, రామారెడ్డి రోడ్డు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. రామారెడ్డి రోడ్డును పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. గొల్లపల్లిలో పెండ్లికి హాజరై.. 45 మందితో రామారెడ్డి మండలం రంగంపేటకు తిరిగి వెళ్తున్న బస్సు సైలెన్సర్​లోకి నీరు చేరి వరద నీటిలో నిలిచిపోయింది. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది తాడు సాయంతో వారిని ఒడ్డుకు చేర్చి మరో బస్సులో పంపించారు.

తిలక్​రోడ్డులోని గంజు హైస్కూల్​ఆవరణ చెరువులా మారింది. క్లాస్​ రూమ్స్ చుట్టూ వరద ఉండడంతో విద్యార్థులు లోపలకు వెళ్లలేకపోయారు. స్టేషన్​ రోడ్డు, రైల్వే బ్రిడ్జి దగ్గర వరద పోటెత్తి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. టేకిర్యాల్​దగ్గర బీటీ రోడ్డు కొంత మేర కొట్టుకుపోయింది. లింగంపేట మండలం లింగంపల్లి శివారులోని వాగువద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వాగులో ఒకరు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. కాగా, భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​సూచించారు.

నిండిన పోచారం.. నిజాంసాగర్​కు ఇన్​ఫ్లో 

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. గాంధారి, లింగంపేట మండలాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు​కెపాసిటీ 1.82 టీఎంసీలు కాగా పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్​ ప్రాజెక్టుకు 7,789 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు కెపాసిటీ17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.18 టీఎంసీల నీరు ఉంది.