హైదరాబాద్‌‌ లో బాయ్ ఫ్రెండ్‌‌తో కలిసి ఐటీ ఉద్యోగిని డ్రగ్స్ దందా

హైదరాబాద్‌‌ లో బాయ్ ఫ్రెండ్‌‌తో కలిసి ఐటీ ఉద్యోగిని డ్రగ్స్ దందా
  • లగ్జరీ లైఫ్‌‌కు అలవాటు పడి సేల్స్​.. డ్రగ్స్ ​పెడ్లర్లుగా అవతారం 
  •     డార్క్​వెబ్‌‌లో ఆర్డర్లు ఇచ్చి కొరియర్‌‌‌‌లో తెప్పిస్తున్న జంట
  •     ఈవెంట్​మేనేజర్, డెలివరీ బాయ్‌‌తోసహా నలుగురు అరెస్ట్​
  •     రూ.4 లక్షల విలువైన డ్రగ్స్​ పట్టివేత 

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో డ్రగ్స్‌‌ నెట్‌‌ వర్క్‌‌ గుట్టు రట్టయింది. బాయ్ ఫ్రెండ్‌‌తో కలిసి డ్రగ్స్‌‌ దందా నడుపుతున్న యువతితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని స్టూడెంట్స్, సాఫ్ట్​వేర్​ఎంప్లాయీస్‌‌ను లక్ష్యంగా చేసుకుని బాయ్​ఫ్రెండ్​తో కలిసి డ్రగ్స్​దందా చేస్తున్న ఓ మహిళా సాఫ్ట్‌‌వేర్​ఇంజినీర్‌‌‌‌తోపాటు మరో ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ వింగ్ (హెచ్‌‌ఎన్‌‌ఈడబ్ల్యూ) పట్టుకున్నది. 

వీరి నుంచి రూ. 4 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్‌‌ఎస్‌‌డీ బ్లాస్ట్​, ఓజీ కుష్ తోపాటు రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులతో కలిసి వీరు జాయింట్​ఆపరేషన్​చేశారు. ఏపీలోని కాకినాడకు చెందిన ఉమ్మిడి ఇమ్మాన్యుయెల్‌‌ (25) కొండాపూర్‌‌‌‌లో ఉంటూఈవెంట్ మేనేజర్‌‌‌‌గా పని చేస్తున్నాడు.  అదే జిల్లాకు చెందిన చోదవరపు సుస్మిత అలియాస్​లిల్లీ ఇమ్మాన్యుయెల్‌‌తో సహజీవనం చేస్తున్నది. 

ఈమె ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌‌వేర్​కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేరింది. కొంతకాలం కింద ఇమ్మాన్యుయెల్​ డ్రగ్స్​వాడేవాడు. తర్వాత డ్రగ్స్​బిజినెస్​చేసి సంపాదించి ఆ డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. డ్రగ్స్​పెడ్లర్​గా మారితే ఎక్కువ డబ్బులు వస్తాయని దందాలోకి దిగాడు. ఇతడిపై మన రాష్ట్రంతో పాటు ఏపీలోనూ ఎన్‌‌డీపీఎస్ కేసులున్నాయి. లగ్జరీ జీవన శైలికి అలవాటు పడిన సుస్మిత తన బాయ్ ఫ్రెండ్‌‌ ఇమ్మాన్యుయెల్‌‌తో కలిసి యువతను టార్గెట్‌‌ చేసుకొని డ్రగ్స్‌‌ విక్రయిస్తున్నది. 

డార్క్​వెబ్​ద్వారా ఆర్డర్.. కొరియర్‌‌‌‌తో డెలివరీ

ఇమ్మాన్యుయెల్‌‌ డార్క్ వెబ్ ద్వారా టార్ బ్రౌజర్ ఉపయోగించి డ్రగ్స్ కొనేవాడు. చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారా జరిపేవాడు. ఈ డ్రగ్స్​డీటీడీసీ, పోస్టల్​ద్వారా వచ్చేవి. ఇమ్మాన్యుయెల్ లేనప్పుడు సుస్మిత ఈ దందా నడిపించేది. వచ్చిన డబ్బులు, పోయిన డబ్బుల లెక్కలన్నీ సుస్మిత చూసేది. వీరికి ఆర్డర్​వచ్చిన తర్వాత రాపిడో, స్విగ్గీలో డెలివరీ బాయ్‌‌గా పనిచేసే కాకినాడకు చెందిన సాయికుమార్ (28) డ్రగ్స్​చేరవేసేవాడు. 

దీని కోసం అతడు డెడ్-డ్రాప్ పద్ధతి ( నో కాంటాక్ట్)   అనుసరించేవాడు. అంటే ఆర్డర్​వచ్చాక డ్రగ్స్‌‌ను ఎక్కడో ఒక చోట పెట్టి ఆ విషయాన్ని యూజర్స్‌‌కు చేరవేసేవాడు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి హోమ్ డెలివరీ చేసేవారని కూడా తెలిసింది.  వీరి గురించి తెలుసుకున్న హెచ్‌‌న్యూ, స్థానిక పోలీసులతో కలిసి రైడ్స్​నిర్వహించింది. 

నిందితుల నుంచి 22 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి (ఓజీ), 5 గ్రాముల ఎండీఎంఏ, 5.57 గ్రాముల ఎక్స్‌‌టసీ పిల్స్, 6 ఎల్‌‌ఎస్‌‌డీ బ్లాట్స్, 4 మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతో డ్రగ్స్​వాడుతున్న చిక్కడపల్లికి చెందిన తలబట్టుల తారక లక్ష్మీకాంత్ అయ్యప్ప (24)ను అరెస్ట్​చేశారు.  డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన డీలర్లు ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  సీఐ ఎస్. బాలస్వామి, ఎస్‌‌ఐ పి.అభిలాష్ పాల్గొన్నారు. డ్రగ్స్​గురించి సమాచారం తెలిస్తే 8712661601 నంబర్‌‌కు తెలియజేయాలని కోరారు.  

డ్రగ్స్​ సప్లయ్​ చేస్తున్న విదేశీ మహిళలు అరెస్ట్‌‌

మెహిదీపట్నం:  నగరంలో డ్రగ్స్​సప్లయ్​చేస్తున్న ఇద్దరు విదేశీ మహిళలను మసాబ్ ట్యాంక్ పోలీసులు  అరెస్టు చేశారు. జాంబియాకు చెందిన ఎమెలీ ములిండే అలియాస్​ క్యాథీ హంచబిలా (29), మలావికి చెందిన ఎలెనా కసకతిరా (48)  ముంబైలో ఉంటున్నారు. ఓ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న బంజారా హిల్స్‌‌లోని జీవీకే మాల్ వెనుక 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏను డెలివరీ చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ నెల 18న డ్రగ్స్​స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరి గురించి తెలియడంతో వారిపై నిఘా పెట్టారు. వారు ముంబైకి పారిపోయే యత్నం చేస్తుండగా బుధవారం పట్టుకున్నారు. రెండున్నర లక్షల నగదు, నకిలీ పాస్‌‌పోర్ట్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.