అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా ప్రజలు గ్యాస్ కొరత ఎదుర్కొంటున్న వేళ హైదరాబాద్ లో గ్యాస్ కొరతపై ఆయా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు స్పందించారు. గ్యాస్ కు ఎలాంటి కొరత లేదు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..తొందరపడి ఎవరూ అదనంగా బుకింగ్స్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుతుందని హైదరాబాద్ నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరతపై సికింద్రాబాద్ లోని బోయగూడ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు అశోక్ క్లారిటీ ఇచ్చారు. డొమెస్టిక్ వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని చెబుతున్నారు. యుద్దం కారణంగా గ్యాస్ సరఫరా ఆగిపోయిందనే భయంతో అందరూ గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో ఒక్కో ఏజెన్సీ నుంచి రోజుకు 700 డొమెస్టిక్ గ్యాష్ బుకింగ్స్ అవుతుండగా..ఇప్పుడు 2700 బుకింగ్స్ అవుతున్నాయి. బుకింగ్ పెరగడంతో తర్వాత రోజు డెలివరీ చేయలేకపోతున్నామని అశోక్ చెబుతున్నారు.
బుకింగ్స పెరగడంతో బర్డెన్ పడి ఆన్ లైన్ లో బుకింగ్ సిస్టమ్ స్లో అవుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ చేస్తాం.. గతంలో బుక్ చేసిన తర్వాతి రోజు డెలివరీ అయ్యేది.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ డెలివరీకి నాలుగు రోజులు పడుందని అన్నారు. డొమెస్టిక్ గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ గా వాడేవారి పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పశ్చిమాసియాలో యుద్ధం, ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్‌లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ స్లో అవడం వల్ల బుకింగ్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు. సాధారణంగా ఒకటి రెండ్రోజుల్లో వచ్చే సిలిండర్.. వారానికి పైగా ఆలస్యంగా అందుతోంది.
హైదరాబాద్, సికింద్రబాద్ జంట నగరాల పరిధిలో భారత్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీల ద్వారా సుమారు 400 డీలర్లు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. దాదాపు 30 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు నగరంలో ఉన్నాయి. గ్యాస్ కొరత తో ఎక్కువగా ఒక్క సిలిండర్ ఉన్న కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించడం లేదని వినియోగదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ కొరతతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గింది. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వాడుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ ను బ్లాక్‌లో కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు మరింత కొరత ఏర్పడుతోంది. హోటల్స్, రెస్టారెంట్ల పై దాడులు చేసి డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వాడుతున్న 69 సిలిండర్ల సీజ్ చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఇలాంటి సమయంలో బ్లాక్ లో గ్యాస్ సిలిండర్లను అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
