పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు! బయటపడ్డ సంచలన నిజాలు.. మొత్తం 37 వేల మందికిపైగా ఎంప్లాయీస్..

పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు! బయటపడ్డ సంచలన నిజాలు..  మొత్తం 37 వేల మందికిపైగా ఎంప్లాయీస్..
  • ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింక్​తో బయటపడ్డ నిజాలు 
  •  వీరిలో 1,500 మంది రెగ్యులర్  
  • మిగిలినవారిలో కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ సిబ్బంది 
  • రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే స్కీములు కట్ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టు గుర్తించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు దారి మళ్లుతున్నాయన్న అనుమానంతో ప్రభుత్వ ఉద్యోగుల డేటాను, సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో లింక్ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు, మరోవైపు నిరుపేదలకు అందాల్సిన పింఛన్లు, ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా పొందుతున్నట్టు అధికారిక లెక్కల్లో తేలింది. 

దీనికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నివేదిక ప్రకారం.. దాదాపు37 వేల మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాల్లో లబ్ధి పొందుతున్నట్టు బయటపడింది. వీరిలో కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో చిరుద్యోగులే కాదు.. ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. మేజర్ కేటగిరీల్లో అంగన్‌‌వాడీలు, ఆశా వర్కర్లు, హోం గార్డులు, వీవోఏలు, వీఆర్‌‌ఏలు, అర్చకులు, మౌజన్ల వంటి వారు ఉన్నప్పటికీ.. పలువురు గెజిటెడ్ స్థాయి అధికారులు కూడా పథకాలు పొందుతున్నారు. 

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(47), ఎస్‌‌జీటీ అండ్ టీజీటీలు (71), పబ్లిక్ హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లు, చివరకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు(5), జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు కూడా జాబితాలో ఉండడం గమనార్హం. వీరి పేర్లు లబ్ధిదారుల జాబితాలోకి ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉద్యోగులందరి ఆధార్ డేటా తీసుకున్న ప్రభుత్వం.. వాటిని ప్రభుత్వ పథకాలతో సరిపోల్చింది. దీంతో ఈ లెక్కలు బయటపడ్డాయి. ఇంకొన్ని స్కీములలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని సెక్రటేరియెట్​ వర్గాలు చెప్తున్నాయి.  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పథకంలోనే అత్యధికంగా ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. 

అధికారుల నివేదిక ప్రకారం.. ఈ ఒక్క పథకంలోనే ఏకంగా 15,704 మంది ఉద్యోగుల వివరాలు లబ్ధిదారుల జాబితాతో సరిపోలాయి. వీరిలో అత్యధికంగా 8,273 మంది గౌరవ వేతనం తీసుకుంటున్న చిరుద్యోగులు ఉండగా, 3,202 మంది అవుట్‌‌సోర్సింగ్ సిబ్బంది, 2,939 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.  విచిత్రమేమిటంటే.. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి జీతాలు తీసుకునే స్టేట్ స్కేల్ రెగ్యులర్ ఉద్యోగులు 478 మంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు 338 మంది కూడా ఈ పథకం కింద డబ్బులు తీసుకుంటున్నట్టు తేలింది. ఇందులో అంగన్‌‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌‌ఎంలు, జూనియర్ లెక్చరర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వంటి అనేక రకాల ఉద్యోగులు ఉన్నారు. 

ఉపాధి హామీలో 11 వేల మంది 

గ్రామాల్లో పనులు దొరక్క ఇబ్బంది పడే కూలీల కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పథకంలోనూ11,210 మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్టు గుర్తించారు. ఇందులో సింహభాగం 7,077 మంది గౌరవ వేతనం తీసుకునే సిబ్బంది ఉన్నారు. అలాగే 2,214 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1,124 మంది అవుట్‌‌సోర్సింగ్ సిబ్బంది ఉపాధి హామీ డబ్బులు పొందుతున్నారు. ఆశ్చర్యకరంగా.. 351 మంది రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకున్నవారి జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.  

ఇందిరమ్మ ఇండ్లు.. ఆత్మీయ భరోసాలోనూ.. 

ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ ఉద్యోగులు భారీగానే లబ్ధి పొందారు. మొత్తం 9,135 మంది ఉద్యోగులు ఇండ్లు పొందినట్టు లేదా మంజూరు చేయించుకున్నట్టు డేటాలో తేలింది. వీరిలో 5,177 మంది హానరోరియం సిబ్బంది కాగా, 2,256 మంది కాంట్రాక్ట్, 1,371 మంది అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద 1,444 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతుండగా, వారిలోనూ హానరోరియం (954), కాంట్రాక్ట్(328) సిబ్బందే అధికంగా ఉన్నారు. 

రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే ‘కట్’.. మిగతావారిపై డైలమా!

డేటా ఆధారంగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులు చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ కింద జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ ఉద్యోగులకు, టైమ్ స్కేల్ ఉద్యోగులకు.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను "తక్షణమే నిలిపివేయాలి" అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. వీరు నిబంధనల ప్రకారం అనర్హులని తేల్చిచెప్పారు. 

అయితే కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ సర్వీసులు, డైలీ వేజ్, హానరోరియం (గౌరవ వేతనం) తీసుకునే సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం  తీసుకోవాల్సి ఉందని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆదాయ పరిమితి ఆధారంగా ఇస్తున్నందున.. కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా అనర్హులుగా పరిగణించాలా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంటే మాత్రం.. దాదాపు 37 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోనున్నాయి.