- ఇంటర్ బోర్డు నిర్ణయం..
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పరీక్ష రాసేందుకు ఇచ్చే హాల్ టికెట్‌నే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లా మార్చేసింది. ఇకపై సెకండియర్ విద్యార్థులకు ఇచ్చే హాల్ టికెట్లపై ఫస్టియర్‌లో వచ్చిన మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను స్పష్టంగా ముద్రించనుంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరులో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం పరీక్షా ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 9.92 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇప్పటివరకు ఇంటర్ మార్కులను కేవలం మెమోల్లోనే చూపించేవారు. . అయితే, కొందరు స్టూడెంట్లు ఈ మార్కుల మెమోను పేరెంట్స్ కు చూపించడం లేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా ఫస్టియర్ లో ఒకటి, రెండు సబ్జెక్టులు పోయినా.. లేదా తక్కువ మార్కులు వచ్చినా కొంతమంది విద్యార్థులు టెన్షన్ పడుతూ ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం లేదు.
చివర్లో మొత్తం అయిపోయాక విషయం తెలిసి పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకుగానూ సెకండియర్ హాల్ టికెట్లపై ఫస్టియర్ మార్కులను కూడా ముద్రించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. దీంతో ఫస్టియర్ లో ఏ సబ్జెక్టులు పోయాయి.. దేనిలో తక్కువగా మార్కులు వచ్చాయనే గుర్తించేందుకు ఈజీ అవుతోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో జవాబుదారీతనం పెరగడంతో పాటు, ఒత్తిడి తగ్గుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
