- యూఎస్ కు అనుకూలమైన వ్యక్తే తదుపరి సుప్రీమని వ్యాఖ్య
- ఇరాన్‌లో అంతర్గత యుద్ధం దిశగా అడుగులు!
- కుర్దులను ఇరాన్‌పై అస్త్రంగా మార్చాలని చూస్తున్న ట్రంప్
- ప్రస్తుతానికి తటస్థంగా ఉంటామని కుర్దుల వెల్లడి
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇరాన్‌లోని భద్రతా దళాలపై దాడులు చేయాలని ఇరాకీ కుర్దిష్ దళాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ తదుపరి నాయకుడిని ఎంచుకోవడంలో అమెరికా పాత్ర ఉండాలని, తమకు అనుకూలమైన వ్యక్తే ఇరాన్ సుప్రీం అవుతారని స్పష్టం చేశారు.
గురువారం ఆయన రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘‘ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిష్ దళాలు ఇరాన్‌పై దాడికి నా పూర్తి మద్దతు ఉంటుంది. అమెరికాకు అనుకూలమైన వ్యక్తే ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ అవుతారు. ఎంపికలో అమెరికా పాత్ర ఉండాల్సిందే" అని పేర్కొన్నారు. కుర్దిష్ దళాలకు ఇచ్చిన పిలుపుతో ఇరాన్‌లో అంతర్గత యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు కుర్దులంటే ఎవరు?
ప్రపంచంలో సొంతంగా ఒక దేశం లేని అతిపెద్ద ఇత్నిక్ గ్రూపే కుర్దులు. ప్రపంచవ్యాప్తంగా వీరి జనాభా 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. వీరు ప్రధానంగా ఆర్మేనియా, ఇరాక్, ఇరాన్, సిరియా, టర్కీ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరిలో మెజారిటీ ప్రజలు సున్నీ ముస్లింలు అయినప్పటికీ ఇతర మతాల వారు కూడా ఉన్నారు.
శతాబ్ద కాలం క్రితం ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఆధునిక మిడిల్ ఈస్ట్ ఏర్పడినప్పుడు కుర్దులకు సొంత దేశం దక్కలేదు. దీంతో వారికి జెండా, మ్యాప్, ప్రభుత్వం లేదు. అందుకే కుర్దులు ‘మాకు పర్వతాలు తప్ప మరెవరూ స్నేహితులు లేరు’ అని అంటుంటారు. దీంతో వారు ప్రత్యేక దేశం, స్వయంప్రతిపత్తి కోసం కుర్దులు ఇప్పటికీ పోరాడుతున్నారు.
వివిధ దేశాల్లో కుర్దుల పరిస్థితి దయనీయం
కుర్దులకు, టర్కీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా చనిపోయారు. ఇరాక్ లో కుర్దులపై సద్దాం హుస్సేన్ కాలంలో రసాయనిక దాడులు జరిగాయి.1991 గల్ఫ్ యుద్ధం తర్వాత కుర్దులు ఉత్తర ఇరాక్‌లో ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరాన్‌లో 1979లో షాను గద్దె దించడానికి జరిగిన విప్లవంలో పాల్గొన్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం తమకు స్వయంప్రతిపత్తి కల్పిస్తుందని ఆశించారు.
కానీ, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం కుర్దుల డిమాండ్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. 2022లో మహ్సా అమిని (ఇరానియన్- కుర్దిష్ మహిళ) మరణం తర్వాత, 2026 జనవరిలో జరిగిన నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)ను ఓడించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ అక్కడ కూడా వారి సొంత దేశ కల నెరవేరలేదు.
కుర్దులను ట్రంప్ ఎందుకు పిలుస్తున్నడు!
ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇరాన్ ను ఓడించడానికి యుద్ధంలోకి కుర్దిష్ గెరిల్లా దళాలైన‘పెష్మెర్గా’(మరణాన్ని వెతుక్కునేవారు) సాయం కోరుతోంది. వీరు పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరారు. కుర్దులు సరిహద్దుల నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తే..ఆ ఆదేశం తన ప్రధాన సైన్యాన్ని సరిహద్దులకు పంపాల్సి వస్తుంది. దీనివల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందని, కుర్దుల దాడులు చూసి ఇరాన్‌లోని ఇతర జాతుల వారు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని..తద్వారా అంతర్గత యుద్ధం మొదలవుతుందని ట్రంప్ భావిస్తున్నారు.
మరోవైపు తమ వైమానిక దళం సాయంతో కుర్దులు ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తే..వాటిని తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని అమెరికా యోచిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఇరాకీ-కుర్దిష్ నాయకులు తాము తటస్థంగా ఉంటామని చెబుతున్నారు. ఎందుకంటే చరిత్రలో ప్రతి యుద్ధంలోనూ కుర్దులు పావులుగా మారి భారీగా ప్రాణనష్టం చవిచూశారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని కుర్దులు భావిస్తున్నారు. కానీ, గత కొన్ని రోజులుగా అమెరికా అధికారులతో కుర్దిష్ గ్రూపులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దళాలు బయట నుంచి బాంబుల వర్షం కురిపిస్తుంటే.. కుర్దిష్ దళాలు లోపల నుంచే ఇరాన్ భద్రతా వ్యవస్థను దెబ్బతీయాలని, బలహీనపరచాలని వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తున్నది
