- 25% లోపు అడ్మిషన్ల కోర్సుల డేటా సేకరణ
- కొత్తగా డిఫెన్స్, ఏరోస్పేస్ మేనేజ్‌మెంట్ కోర్సులు
- 29న వీసీలతో కౌన్సిల్ కీలక భేటీ.. సిలబస్ ప్రక్షాళనపైనా చర్చ
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీలు, కాలేజీల్లో ఏండ్ల తరబడి కొనసాగుతూ.. విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపని కోర్సులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ‘జీరో అడ్మిషన్లు’ ఉన్న కోర్సులను ఎత్తివేయడంతో పాటు, డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను తీసుకురావాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) భావిస్తోంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 29న ఉదయం11 గంటలకు గచ్చిబౌలిలోని ‘నిథమ్’ క్యాంపస్‌లో రాష్ట్రంలోని 13 వర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో కౌన్సిల్ కీలక సమావేశం నిర్వహించనుంది.
ఏండ్ల తరబడి సిలబస్ మార్చకపోవడం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కొన్ని సంప్రదాయ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఇలాంటి ‘జీరో అడ్మిషన్’ కోర్సులను, అలాగే 25 శాతంలోపు అడ్మిషన్లు నమోదవుతున్న కోర్సులను కొనసాగించడంతో వనరులు వృథా అవుతున్నాయని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. అందుకే ఆయా కోర్సుల లెక్క తేల్చాలని అధికారులు డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగానే అడ్మిషన్లు లేని కాలేజీలు, కోర్సుల డేటాను పంపాలని కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఇటీవల వీసీలకు సూచించారు. గడిచిన పదేండ్ల వివరాల రిపోర్ట్ ఆధారంగానే 29న జరిగే భేటీలో ఆయా కోర్సులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాతవి తీసేసి.. కొత్తవి తెచ్చే ప్లాన్‌లో భాగంగా ఎమర్జింగ్ సెక్టార్లపై కౌన్సిల్ ఫోకస్ పెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ‘డిఫెన్స్ మేనేజ్‌మెంట్’, ‘ఏరోస్పేస్ మేనేజ్‌మెంట్’ వంటి ఇన్నోవేటివ్ కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలని ప్రతిపాదించింది.
పీజీలోనూ సిలబస్ మార్పులు
మరోవైపు ఈ విద్యా సంవత్సరం (2025–-26) నుంచి డిగ్రీ సెమిస్టర్ సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. పీజీ, పీహెచ్‌డీ, ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్‌ను కూడా యూజీసీ, ఏఐసీటీఈ ప్రమాణాలకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అకడమిక్ ఆడిట్ నిర్వహణ, ఎంట్రన్స్ టెస్టుల టైమింగ్స్‌పైనా వీసీల సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
