- రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక
- అన్ని పార్టీలు బలపర్చిన సర్పంచ్‌లు కలిసిరావాలని పిలుపు
- గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్
కరీంనగర్, వెలుగు: నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీలన్నింటికీ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పంచాయతీలకు ఫండ్స్ మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను మళ్లించి పంచాయతీలను సర్వనాశనం చేసింది. ఈ సారి ఆ పరిస్థితి రాకూడదంటే కేంద్ర నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు నిధులిచ్చేదాకా పోరాడతాం. ఈ విషయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులు కూడా కలిసి రావాలి” అని సంజయ్ కోరారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను బుధవారం రేకుర్తిలో సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలిస్తే ఇబ్బందుల్లో పడతారని, గ్రామాల్లో మొదట చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త సర్పంచ్‌లకు సూచించారు. ‘‘బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించిన 108 గ్రామాల అభివృద్ధికే ఇక నుంచి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. వాటిని ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. ఎంపీ నిధులతో పాటు సీఎస్సార్ ఫండ్స్‌తో ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తాను. ప్రతి స్కూల్‌లో టాయిలెట్లను నిర్మిస్తాను. ప్రతి గ్రామంలో విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తాను. త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేయిస్తాను” అని హామీ ఇచ్చారు.
