CSK vs PBKS: జట్టులో ధోని అనవసరం.. అతని బదులు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోండి: హర్భజన్ సింగ్

CSK vs PBKS: జట్టులో ధోని అనవసరం.. అతని బదులు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోండి: హర్భజన్ సింగ్

ఐపీఎల్ 2024 సీజన్ లో ధోనీ తనదైన మెరుపులతో అదరగొడుతున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి బౌండరీలతోఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. 200 పైగా స్ట్రైక్ రేట్ తో తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మహేంద్రుడిపై విమర్శలు కురుస్తున్నాయి. జట్టు కోసం బాధ్యత తీసుకోకుండా చివర్లో బ్యాటింగ్ కు వస్తున్నాడని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీని తప్పు పట్టాడు. ధోనీ స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవాల్సిందిగా అతను సూచించాడు. ఇంతకీ ధోనీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. 

ఐపీఎల్ లో భాగంగా నిన్న (మే 5) చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ధోనీ 9 వ స్థానంలో బ్యాటింగ్ కి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాంట్నర్, శార్దూల ఠాకూర్ తో లాంటి ప్లేయర్స్ ధోనీ కంటే ముందు బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ బాధ్యత తీసుకోకుండా చివరి ఓవర్లో బ్యాటింగ్ కు రావడం హర్భజన్ కు నచ్చలేదు. దీంతో మహీపై విమర్శల వర్షం కురిపించాడు. 

“ఎంఎస్ ధోని 9వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే అతను మ్యాచ్ లో ఉండడానికి అనర్హుడు. దీని బదులు ఫాస్ట్ బౌలర్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోవడం మంచిది. త్వరగా బ్యాటింగ్‌కు రాకుండా అతని జట్టును నిరాశపరిచాడు. శార్దూల్ ఠాకూర్ అతని కంటే ముందు వచ్చాడు. ఠాకూర్ ధోనీలా షాట్లు కొట్టలేడు. ధోనీ ఎందుకు ఈ తప్పు చేశాడో అర్థం కావడం లేదు. అతని అనుమతి లేకుండా ఏమీ జరగదు. అతను బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి రావడానికి వేరొకరు కారణమంటే నేను నమ్మను. అని   తగ్గించే ఈ నిర్ణయం మరొకరు తీసుకున్నారని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ అన్నాడు.

ఈ మ్యాచ్ లో 9 వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోనీ తొలి బంతికే హర్షల్ పటేల్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ పై చెన్నై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ 139 పరుగులకే పరిమితమైంది.