జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులకుగాను బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30, కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గానికి 20 మందికి టికెట్లు లభించాయి. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 8, జీవన్‌రెడ్డి వర్గానికి 4 సీట్లు కేటాయించడంతో జీవన్‌రెడ్డి వర్గీయుల్లో ఆగ్రహావేశం కట్టలు తెంచుకున్నది. దీంతో రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత తమ పదవులకు రాజీనామా చేశారు.
‘కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేండ్లుగా పనిచేస్తే నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసి .. నా మెడ కోసేసింది’అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వార్డు నుంచి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చినా మేకల రమేశ్ పోటీకి నిరాకరించారు. వర్గపోరు కారణంగా పోటీలో ఉండలేనని తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉద్రిక్తత కారణంగా ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ కార్యాలయం, ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాగర్ కర్నూల్‌లో 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలి శ్రీనివాసుకు బీ ఫామ్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 11వ వార్డునుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మల్లెపల్లి జగన్‌కు టికెట్ నిరాకరించడంతో పార్టీకి రిజైన్ చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కుడుముల మనోహర్‌రెడ్డికి పార్టీ టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా బరిలో నిలిచారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకపోవడంతో నీలం శ్రీలత ఎంపీడీవో ఆఫీసు ఎదురుగా బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ శాపనార్థాలు పెడుతూ దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేశారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ పొత్తు కుదుర్చుకుని, తమకు అన్యాయం చేశారంటూ ఆర్వో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పొత్తు పేరుతో గొంతు కోశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్లోగన్స్చేశారు.
సూర్యాపేట 46వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఊర గాయత్రి టికెట్ దక్కకపోవడంతో విత్ డ్రా కోసం వచ్చి మున్సిపల్ ఆఫీసు వద్ద కండ్లు తిరిగి కిందపడిపోయారు. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు ఆఫీసర్లు ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌లో డీసీసీ ప్రెసిడెంట్ దేవీ ప్రసన్న పార్టీ టికెట్లు అమ్ముకున్నారని 17 డివిజన్‌నుంచి టికెట్ ఆశించిన సిట్టింగ్కౌన్సిలర్ మోరే రూప ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లో చేరిన తనకు టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో సీపీఐ వ్యక్తికి బీ ఫామ్ ఎలా ఇస్తారని ఆమె మండిపడ్డారు.
