హైదరాబాద్ లో దారుణం... రూ. 3 వేల కోసం లోన్ యాప్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య 

హైదరాబాద్ లో దారుణం... రూ. 3 వేల కోసం లోన్ యాప్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య 

హైదరాబాద్ లో దారుణం జరిగింది.. రూ. మూడు వేలు చెల్లించాలంటూ లోన్ యాప్ ఏజెంట్స్ వేధించడంతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ( ఫిబ్రవరి 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రేమ్ కుమార్ లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో వేధింపులు స్టార్ట్ చేశారు లోన్ యాప్ నిర్వాహకులు.

రూ. మూడు వేలు చెల్లించాలంటూ ప్రేమ్ కుమార్ పై ఒత్తిడి తెచ్చారు లోన్ యాప్ నిర్వాహకులు. మేడారం సమ్మక్క సారక్క జాతర వెళ్లి తిరిగి వస్తుండగా.. లోన్ యాప్ ఏజెంట్ నుంచి ప్రేమ్ కుమార్ కు  ఫోన్ వచ్చిందని.. డబ్బులు చెల్లించకపోతే ఫ్యామిలీ మొత్తానికి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించినట్లు తెలిపారు పోలీసులు.

లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులకు మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్ తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. లోన్ యాప్స్ మాయలో పడి అప్పులపాలు కావద్దని..బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకోవద్దని కోరుతున్నారు పోలీసులు. లోన్ యాప్ బెదిరింపులపై తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.