T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్

T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్

పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ట్రోఫి గెలిస్తే ఒక్కొక్క ఆటగాడికి లక్ష డాలర్ల భారీ బహుమతిని ప్రకటించారు. దీని ప్రకారం ఒకో ఆటగాడికి రూ. 3 కోట్లు అందుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించి ఆటగాళ్లను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.  క్రికెట్ వేదికపై పాకిస్థాన్ టైటిల్ గెలవడం కంటే తమకు డబ్బు ఎక్కువ కాదని ఆయన అన్నారు. 

గడ్డాఫీ స్టేడియం లాహోర్‌లో జాతీయ స్క్వాడ్‌తో జరిగిన సమావేశంలో, ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రివార్డ్ ప్రకటనను తెలియజేశారు, మైదానంలో తమ పోరాట పటిమను ప్రదర్శించాలని ఆటగాళ్లను కోరారు. టోర్నీలో ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా దృఢ సంకల్పంతో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నఖ్వీ ధీమా వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్ల అద్భుతమైన విజయాలను అభినందిస్తూ.. టీ20 మ్యాచ్‌లలో 3000 పరుగులను రేర్ ఫీట్ సాధించినందుకు మొహమ్మద్ రిజ్వాన్‌కు.. అదే విధంగా టీ20 ఫార్మాట్ లో 100 వికెట్లు సాధించినందుకు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాకు మొహ్సిన్ నఖ్వీ ప్రత్యేక గ్రీన్ షర్టులను బహూకరించారు.

పాకిస్థాన్ ఇటీవలే న్యూజీలాండ్ తో సిరీస్ ను 2-2 తో ముగించుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇంగ్లాండ్ సిరీస్ కు సిద్ధమవుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. ఇప్పటికే అన్ని జట్లు దాదాపు తమ వరల్డ్ కప్ కప్ జట్లను కూడా ప్రకటించేశాయి. కాగా.. పాకిస్థాన్, శ్రీలంక ప్రకటించాల్సి ఉంది.