నిమిషాల్లో రూ.50వేల కోట్లు ఆవిరి.. 30 నెలల దిగువకు ఇన్ఫోసిస్ స్టాక్.. ఏం జరుగుతోంది?

నిమిషాల్లో రూ.50వేల కోట్లు ఆవిరి.. 30 నెలల దిగువకు ఇన్ఫోసిస్ స్టాక్.. ఏం జరుగుతోంది?

ఇండియన్ టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌కు స్టాక్ మార్కెట్‌లో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 7.3 శాతం పతనమై.. గత 30 నెలల్లోనే అత్యంత దారుణమైన రోజును నమోదు చేశాయి. NSEలో ఇన్ఫోసిస్ షేరు ధర 1,534 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. కేవలం ఒక్కరోజే ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 49 కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక.. భారతీయ ఐటీ రంగమంతా అమ్మకాల ఒత్తిడితో విలవిల్లాడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 6.35 శాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లలో భయాలు కొనసాగుతున్నాయి.

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్. ఏఐ కంపెనీ తన 'క్లాడ్' చాట్‌బాట్ కోసం ఆంత్రోపిక్ తీసుకొచ్చిన కొత్త ప్లగ్-ఇన్లు.. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను అతి తక్కువ ఖర్చుతో ఆటోమేట్ చేయగలవని వెల్లడైంది. సాధారణంగా ఇలాంటి పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు సాఫ్ట్‌వేర్ సేవల సంస్థలకు భారీగా ఫీజులు చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఏఐ ద్వారానే ఈ పనులు సులువుగా జరిగిపోతుండటంతో.. ఇన్ఫోసిస్ లాంటి సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం పెట్టుబడిదారులను ప్రస్తుతం వెంటాడుతోంది. 

►ALSO READ | మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరా..? బడ్జెట్ వల్ల వచ్చిన టాక్స్ రూల్స్ మార్పు గురించి తెలుసా..

అమెరికా మార్కెట్లలో నాస్డాక్ పతనమైన వేడి.. భారత్‌లో ఐటీ షేర్లను భారీ నష్టాల్లోకి నెట్టింది. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు కూడా 5 నుంచి 8 శాతం వరకు కుప్పకూలాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఐటీ షేర్లు కూడా ఈ సెగ నుంచి తప్పించుకోలేకపోయాయి. రానున్న రోజుల్లో మనుషుల అవసరం లేకుండా ఏఐ సాఫ్ట్‌వేర్ పనులను పూర్తి చేస్తుండటం, ఐటీ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ ఆదాయానికి గండికొడుతుందనే రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. మొత్తం మీద ఏఐ విప్లవం ఐటీ రంగానికి ఒక సవాలుగా మారుతూ, మార్కెట్ విలువను భారీగా దెబ్బతీస్తోంది.