మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరా..? బడ్జెట్ వల్ల వచ్చిన టాక్స్ రూల్స్ మార్పు గురించి తెలుసా..

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరా..? బడ్జెట్ వల్ల వచ్చిన టాక్స్ రూల్స్ మార్పు గురించి తెలుసా..

కేంద్ర బడ్జెట్ 2026 ఇన్వెస్టర్లకు.. ముఖ్యంగా డివిడెండ్ ఆదాయంపై ఆధారపడే వారికి షాకిచ్చే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లేదా షేర్ల ద్వారా వచ్చే డివిడెండ్ ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న పన్ను మినహాయింపును పూర్తిగా తొలగించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 93 ప్రకారం.. డివిడెండ్ ఆదాయం సంపాదించడానికి అయ్యే వడ్డీ ఖర్చులపై ఇకపై ఎలాంటి మినహాయింపులు లభించవు. ఇది నేరుగా మధ్యతరగతి, సంపన్న ఇన్వెస్టర్ల జేబుపై ప్రభావం చూపనుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఎవరైనా వ్యక్తి లోన్ తీసుకుని షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే.. ఆ పెట్టుబడి ద్వారా వచ్చే డివిడెండ్ ఆదాయంలో కొంత భాగాన్ని వడ్డీ ఖర్చుల కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు. ఈ మినహాయింపు మొత్తం డివిడెండ్ ఆదాయంలో గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే అంగీకరించబడేది. ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్ష రూపాయల డివిడెండ్ ఆదాయం వచ్చి.. దానికి సంబంధించి 25 వేల రూపాయల వడ్డీ ఖర్చు అయితే, పాత రూల్స్ ప్రకారం 20 వేల రూపాయలను ఆదాయం నుండి మినహాయించి, మిగిలిన 80 వేల రూపాయలపైనే పన్ను లెక్కించేవారు. కానీ ఈసారి బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదిత మార్పు ప్రకారం.. ఆ లక్ష రూపాయల ఆదాయంపై పైసా మినహాయింపు లేకుండా పూర్తిస్థాయిలో పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే సంపాదనకోసం అప్పు చేసి పెట్టుబడి పెడితో ఆ వడ్డీకి ఎలాంటి రాయితీ రాదని టాక్స్ పేయర్స్ గుర్తించుకోవాలి.

►ALSO READ | ఐటీ కంపెనీలకు కునుకులేకుండా చేస్తున్న Anthropic ఏఐ టూల్.. Infosys, TCS స్టాక్స్ క్రాష్..

బడ్జెట్ 2026 ప్రతిపాదనల ప్రకారం ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం కింద పరిగణించే డివిడెండ్ లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఆదాయంపై ఎలాంటి వడ్డీ ఖర్చులను క్లెయిమ్ చేయడానికి వీల్లేదన్నమాట. ఈ నిబంధన వ్యక్తులతో పాటు అన్ని రకాల అసెసీలకు వర్తిస్తుంది. అంటే పెట్టుబడి కోసం రుణాలు తీసుకునే వ్యూహాన్ని అనుసరించే వారికి ఇది గట్టి దెబ్బేనని చెప్పాలి. వడ్డీ ఖర్చును ఆదాయం నుంచి తగ్గించుకునే అవకాశం లేకపోవడం వల్ల.. నికర ఆదాయం తగ్గి పన్ను భారం పెరుగుతుందని టాక్స్ పేయర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే డివిడెండ్ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వడ్డీ ఖర్చులతో సంబంధం లేకుండా మొత్తం ఆదాయాన్ని టాక్స్ లెక్కకట్టేందుకు తీసుకుంటారు. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను మేనేజ్ చేసే విధానంలో ఇది కీలక మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో క్రమం తప్పకుండా డివిడెండ్ ఆదాయం పొందే వారు తమ టాక్స్ ప్లానింగ్‌ను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.