36 ఏళ్ల వ్యాపారవేత్తను కొట్టి చంపిన ఫుడ్ డెలివరీ బాయ్స్

36 ఏళ్ల వ్యాపారవేత్తను కొట్టి చంపిన ఫుడ్ డెలివరీ బాయ్స్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 36 ఏళ్ల వ్యాపారవేత్తను ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. 36 ఏళ్ల శివం గుప్తా తల్లిదండ్రులతో లక్ష్మీ నగర్‌లో నివసిస్తున్నాడు. తన బావమరిదితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 2026, జనవరి 3న శివం గుప్తా ఫ్రెండ్‎తో కలిసి పార్టీకి వెళ్లాడు. 

పార్టీ ముగిసిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్తుండగా రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలోని కన్నాట్ ప్లేస్‌లో శివంగుప్తాకు ముగ్గురు డెలివరీ బాయ్స్‎తో ఘర్షణ తలెత్తింది. వివాదం చిలికి చిలికి గాలివానలా  మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో శివం గుప్తాపై విచక్షణరహితంగా దాడి చేశారు. రోడ్డుపై పడేసి రక్తం వచ్చేలా కొట్టి అక్కడి నుంచి పరార్ అయ్యారు. 

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుగాయపడ్డ గుప్తాను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలు  కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శివం గుప్తా బుధవారం (జనవరి 4) మరణించాడు. శివం గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శివం గుప్తాపై దాడి చేసిన వారిలో ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశారు.