ట్రిపోలి: లిబియా దివంగత నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్-ఇస్లాం (53) గడాఫీ దారుణ హత్యకు గురయ్యాడు. లిబియా రాజధాని ట్రిపోలీకి నైరుతి దిశలో 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న జింటాన్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు సైఫ్ అల్-ఇస్లాంను హత్య చేసినట్లు లిబియా సీనియర్ అధికారులు తెలిపారు. హత్యకు కారణం ఏంటన్నది స్పష్టంగా తెలియలేదు.
అయితే.. ఆగంతకులు జరిపిన కాల్పుల్లో సైఫ్ అల్-ఇస్లాం మరణించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సైఫ్ అల్-ఇస్లాం రాజకీయ సలహాదారుడు అబ్దుల్లా ఒథ్మాన్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఆయన మరణాన్ని ధృవీకరించాడు. మనం దేవునికి చెందినవాళ్లమని.. ఆయన దగ్గరకే తిరిగి వెళ్లామని పేర్కొన్నాడు. సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ దేవుని సంరక్షణలో ఉన్నాడని తెలిపాడు.
ALSO READ : మా చమురు కొనబోమని ఇండియా చెప్పలేదు
సైఫ్ అల్-ఇస్లాం బ్యాగ్రౌండ్:
నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్-ఇస్లాం 1972 జూన్‌లో ట్రిపోలిలో జన్మించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. గడాఫీ రాజకీయ వారసుడిగా బాధ్యతలు చేపతాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాల నియంత పాలన తర్వాత 2011లో నాటో తిరుగుబాటుతో గడాఫీ పదవీచ్యుతుడయ్యాడు. అదే సంవత్సరం హత్యకు గురయ్యాడు.
ALSO READ : అమెరికా వ్యవసాయ రంగానికి బూస్ట్..
తండ్రి హత్య తర్వాత 2011లో సైఫ్ అల్-ఇస్లాం నైజర్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా జింటాన్ ఉగ్రవాదులు సైఫ్ అల్-ఇస్లాంను బంధించారు. 2017లో క్షమాభిక్ష ప్రసాదించి వదిలేశారు. 2021 నవంబర్లో లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయ పునరాగమనానికి ప్రయత్నించాడు. అతని నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా గడాఫీ వ్యతిరేక సమూహాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో లిబియా హై నేషనల్ ఎలక్షన్స్ కమిటీ అతడిని అధ్యక్ష ఎన్నికలో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది.
