మా చమురు కొనబోమని ఇండియా చెప్పలేదు: ట్రంప్ ప్రకటనపై రష్యా కౌంటర్

మా చమురు కొనబోమని ఇండియా చెప్పలేదు: ట్రంప్ ప్రకటనపై రష్యా కౌంటర్

న్యూఢిల్లీ: ఇండియా రష్యా నుంచి క్రూడాయిల్​కొనుగోలును ఆపేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై రష్యా స్పందించింది. ఇప్పటి వరకు భారత్ తమకు అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం ప్రకటించారు. భారత్‎తో ట్రేడ్ డీల్ గురించి ప్రకటిస్తూ  భారత్.. రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం ఆపేస్తుందని, అమెరికా, వెనిజులా నుంచి ఆయిల్ కొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిపిందే. భారత్ 500 బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా వస్తువులను కొంటుందని చెప్పారు. 

అలాగే భారత్‎పై టారిఫ్‌‌‌‌లను18 శాతానికి తగ్గిస్తామని కూడా పేర్కొన్నారు. ఇది భారత్-అమెరికా వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తుందని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ చేసిన​ప్రకటనను రష్యా తిరస్కరించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ‘‘న్యూఢిల్లీ నుంచి ఇలాంటి ఏ ఒప్పందం లేదా చమురు కొనుగోలు ఆపేస్తామని ఎటువంటి ప్రకటన రాలేదు’’ అని స్పష్టం చేశారు. 

భారత్ చాలా కాలంగా రష్యా నుంచి చమురు కొంటోందని, రెండు దేశాల మధ్య వ్యాపారం, వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా ముఖ్యమైనవని పెస్కోవ్ తెలిపారు. ట్రంప్ మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, భారత్‌‌‌‌తో సంబంధాలను మరింత బలపరచాలని రష్యా భావిస్తున్నదని చెప్పారు. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎలాంటి అధికారిక స్పందన తెలియజేయలేదు. అమెరికా టారిఫ్ తగ్గింపును మాత్రం ధృవీకరించింది.