హుస్నాబాద్ ను అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన పలు వార్డుల్లో అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక వైశ్య భవన్​లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు ఖరారు చేసిన 20 మంది అభ్యర్థుల లిస్టును అధికారికంగా ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..విద్యావంతుల కోరిక మేరకు 35 ఎకరాల్లో శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చామని, ప్రస్తుతం భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. మార్కెట్ యార్డ్ లో రూ.8.50 కోట్లతో నీటి మళ్లింపు పనులు చేశామన్నారు. 

250 పడకల ఆస్పత్రి, చిల్డ్రన్స్ పార్క్, కరీంనగర్ ఫోర్​లైన్, రింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆరెపల్లి శ్మశానవాటిక పనులను 100 రోజుల్లోగా పూర్తి చేస్తామని, లేదంటే ఓటు అడగనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 500 ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించామన్నారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, నాయకులు లింగమూర్తి, శివయ్య, వెంకట్, శ్రీనివాస్, అనితారెడ్డి పాల్గొన్నారు.