V6 News

కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలె

కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలె
  •     రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ మంది వాళ్లే..
  •     మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వస్తే తమకు మేలు జరుగుతుందనుకున్న కౌలు రైతులను టీఆర్ఎస్​ సర్కారు పూర్తిగా విస్మరించిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పన్నెండు లక్షల మంది కౌలు రైతుల కోసం ఒక్క స్కీమ్​ను కూడా అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. పెట్టుబడి స్తోమత లేక, బ్యాంకు లోన్లు రాక, కౌలుకు తీసుకున్న భూమికి పైసలు కట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు ఇస్తున్నామని చెప్పే సర్కారు.. కౌలు రైతులను దూరం పెట్టడం దారుణమన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని ఆమలు చేయాలని వివేక్​ డిమాండ్ చేశారు. గత ఆరేండ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో చాలా మంది కౌలు రైతులే ఉన్నారని గుర్తు చేశారు. రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా స్కీంలన్నింటిలో కౌలు రైతులకు ప్రయోజనం కల్పించి, ఆదుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్