దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.O’ పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది
నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, IDFC, ఇండస్, కర్ణాటక, కరూర్, HDFC బ్యాంక్ మేనేజర్లు అరెస్ట్ అయ్యారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. .
►ALSO READ | సైబర్ నేరగాళ్ల టార్గెట్ వాళ్లే.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ: సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్
హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

