V6 News

జపాన్‌లో అతిపెద్ద భూకంపం.. భారీ సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో అతిపెద్ద భూకంపం.. భారీ సునామీ హెచ్చరికలు జారీ

టోక్యో: జపాన్‌లోని తోహోకు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 7.4గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం సాన్‌రికు తీరానికి సమీపంలో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం 4:53 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. భూ ప్రకంపనల ప్రభావం జపాన్ రాజధాని టోక్యో, ఈశాన్య జపాన్‌లోని పలు ప్రాంతాలపైన చూపించింది.

భారీ భూప్రకంపనలతో పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు, ఎత్తైన వంతెనలు కొన్ని నిమిషాల పాటు ఊగిపోయాయి. కొన్ని చోట్ల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 

భూకంపం సంభవించిన 30 నిమిషాలలోపు అలలు తీర ప్రాంతాలను తాకవచ్చిన జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీరం వద్ద అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హోక్కైడో, మధ్య పసిఫిక్ తీరం, అమోరి ప్రిఫెక్చర్ తీరం, ఇవాటే ప్రిఫెక్చర్ తీరం తీవ్రంగా ప్రభావం అవ్వొచ్చని హెచ్చరించింది. 

Also Read : గల్ఫ్ గడ్డపై అమెరికా బేస్‌లు అవుట్?

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. భూకంప నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాగం వెంటనే అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.