హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని విమర్శించారు. ఎల్‌నినో వస్తుందని శాస్త్రవేత్తలు 6 నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఇప్పటికే రైతులు నష్టపోయారని, ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ సోమవారం తెలంగాణభవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు.
‘రెండేండ్లు దాటినా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. 70 వేల ఉద్యోగాల నియామకంపై నా సవాల్‌కు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదు. నువ్వే 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ, ఆ సవాల్‌ను స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు’ అని కేటీఆర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని.. కానీ, మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. 31 నెలలు గడిచినా రెండు పిల్లర్లను బాగు చేయలేరా? అని కేటీఆర్ విమర్శించారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వెంకన్న శాపం తగుల్తది
బాన్సువాడ ప్రజలు ఒకప్పుడు గులాబీ జెండాను ఎగరేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించారని.. అయితే, ఆయన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని కేటీఆర్ అన్నారు. ‘‘నాది కాంగ్రెస్‌లోనే పుట్టుక అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అందులో చేరిండు. ఇప్పుడు మింగలేక కక్కలేక, కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకునే పరిస్థితికి చేరుకున్నాడు. తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన బాన్సువాడ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఆ సందర్భంగా దేవుడి మీద ఒట్టేసి ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీతోనే ఉంటా’ అని చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. "దేవుడి మీద ఒట్లు పెట్టి ఒక్క రేవంత్ రెడ్డే మోసం చేస్తాడనుకున్నాం. కానీ, పోచారం కూడా మోసం చేశారు. తెలంగాణ తిరుమల వెంకన్న స్వామి శాపం ఆయనకు తప్పకుండా తగులుతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు
