- ఇటీవల రూ.96 లక్షలతో నాలాల పూడికతీత
- నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకొన్న కాంట్రాక్టర్లు
- ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక నిండిపోయి ఓవర్ ఫ్లో అయిన డ్రైన్లు
- జనాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
- కాంట్రాక్టర్లతో మళ్లీ పనులు చేపట్టేలా జీడబ్ల్యూఎంసీ చర్యలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, డ్రైన్లలో డీసిల్టేషన్ పనులు పేరుకే పరిమితమవుతోంది. వర్షాకాలంలో ముంపు ముప్పును నివారించడానికి ఏటా పూడికతీత పనులు చేపడుతున్నా, కాంట్రాక్టర్లు నామమాత్రంగా పనులు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాల్వల్లో పూడిక అలాగే పేరుకుపోతోంది. ఇటీవల కురిసిన ఒక్క వానకే నగరంలోని పలుచోట్ల రోడ్లు, జంక్షన్లు, కాలనీలు జలమయమయ్యాయి. కాంట్రాక్టర్లు అసంపూర్తిగా వదిలిన చోట్ల మళ్లీ డీసిల్టేషన్ చేపట్టేలా గ్రేటర్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటున్నారు.
రూ.96 లక్షలతో డీసిల్టేషన్ పనులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన నాలాలు, ఇంటర్నల్ డ్రైన్లు పూడికతో నిండిపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడంలేదు. ఈ నేపథ్యంలో 33 ప్రధాన నాలాలు, ఇంటర్నల్ డ్రైన్లలో డీసిల్టేషన్ కోసం రూ.96 లక్షలు కేటాయించారు. ఒక మీటర్ కంటే తక్కువ వెడల్పు ఉన్న డ్రైన్లను జీడబ్ల్యూఎంసీ పబ్లిక్ హెల్త్ శానిటేషన్ సిబ్బంది క్లీన్చేస్తుండగా, అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాలాల పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. గత నెలలోనే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం తొలగించిన పూడికను ఆరిన తర్వాత డంప్ యార్డుకు తరలించాల్సి ఉంటుంది.
పనులపై ఆరోపణలు..
డీసిల్టేషన్ పనుల్లో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో డీసిల్టేషన్ సందర్భంగా తొలగించిన సిల్ట్పరిమాణం, జీపీఎస్ వెహికల్లో డంప్ యార్డుకు తరలింపు, ఫొటోలు, ఎంబీ రికార్డుల ఆధారంగా బిల్లులు చెల్లిస్తారు. అయితే గ్రేటర్ వరంగల్‌లో అలాంటి ప్రక్రియను పూర్తిగా పాటించలేదని, పనులు పూర్తికాకముందే బిల్లులు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఓపెన్ నాలాల్లో కొంత మేర పూడికతీసి, శ్లాబులు ఉన్నచోట మాత్రం వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా అన్ని పనులు పూర్తయినట్లుగా రికార్డుల్లో నమోదు చేసినట్లు సమాచారం. దీంతో డ్రైన్లలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక అలాగే ఉండిపోయాయి. ఫలితంగా సమస్య అలాగే మిగిలిపోగా, ఇటీవల కురిసిన ఒక్క వానకే అసలు సంగతి బయటపడింది.
మళ్లీ డీసిల్టేషన్‌కు ఆదేశాలు..
నగర వ్యాప్తంగా ఇప్పటికే రూ.96 లక్షలతో డీసిల్టేషన్ చేపట్టినా లోపాలు బయటపడటంతో కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల గ్రేటర్ కమిషనర్, ఇంజినీరింగ్ ఆఫీసర్లతో సమావేశమైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డీసిల్టేషన్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముంపు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో గ్రేటర్ ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మళ్లీ డీసిల్టేషన్ చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. శ్లాబులు, టెంపరరీ పైకప్పులు ఉన్నచోట వాటిని తొలగించి పూడికతీత పనులు మొదలుపెట్టారు. అయితే వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి కావాల్సిన పనులు, లోపాలు బయటపడిన తర్వాత చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జీడబ్ల్యూఎంసీ ఈఈ రవికుమార్ స్పందిస్తూ, గతంలో డీసిల్టేషన్ చేయని డ్రైన్లలో ప్రస్తుతం పూడికతీత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేయలేదని వివరించారు.
ఒక్క వానకే ఓవర్‌ఫ్లో..
డ్రైన్లలో సిల్ట్పూర్తిగా తొలగించకపోవడంతో గత శుక్రవారం కురిసిన ఒక్క వానకే నగరంలోని పలు ప్రాంతాల్లో ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హనుమకొండలోని తిరుమల జంక్షన్, వికాస్ నగర్, అంబేద్కర్ భవన్, కాకతీయ డిగ్రీ కాలేజీ లైన్, హనుమకొండ చౌరస్తా, అమృత జంక్షన్, అలంకార్ సెంటర్, ములుగు రోడ్డుతో పాటు వరంగల్‌లోని ఎంజీఎం సెంటర్, బట్టల బజార్, భద్రకాళి బండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నాలాలు ఓవర్ ఫ్లో అయ్యాయి. రోడ్లన్నీ జలమయమై వాహనదారులు, ప్రజలు గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
