కాళేశ్వరం కట్టింది.. కూల్చింది BRS వాళ్లే..రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో జూదం ఆడబోం

కాళేశ్వరం కట్టింది.. కూల్చింది BRS వాళ్లే..రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో జూదం ఆడబోం
  • బీఆర్ ఎస్ నేతల దుష్ర్పచారాన్ని  ప్రజలు నమ్మొద్దు
  • వచ్చే జూలై నుంచి ప్రాజెక్ట్ వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ
  • ఐఐటీ బాంబే డిజైన్లతో పునరుద్ధరణ పనులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్గొండ, వెలుగు : ‘కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా డిజైన్ చేసింది బీఆర్ఎస్.. నాసిరకంగా నిర్మించింది బీఆర్ఎస్.. చివరకు దాన్ని కూల్చింది కూడా బీఆర్ఎస్సే, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతోంది’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 

ఎల్ నినో ప్రభావంపై ఇన్ చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్​మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద ప్రత్యక్ష ఆయకట్టు లేదని, అయినా నీళ్లు నింపాలనడం వెనుక కుట్ర ఉందన్నారు. 

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కూడా బలహీనంగా ఉందని నిపుణులు తేల్చారని చెప్పారు. 2022లో వరదలు వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ మునిగిపోయిందని గుర్తు చేశారు. అనుభవజ్ఞుడైన కర్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని కమిటీ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తోందని, ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యవేక్షణ కమిటీ అనుమతులు వచ్చాకే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 

నీళ్లు నింపితే ఊళ్లు కొట్టుకుపోతాయ్

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితంగా లేవని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ హెచ్చరించిందని ఉత్తమ్ తెలిపారు. కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి బ్యారేజీల్లో నింపితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, దిగువన ఉండే గ్రామాలు మునిగిపోయి ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. 

రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో జూదం ఆడబోదన్నారు. ప్రాజెక్టును వదిలిపెట్టమని, శాస్త్రీయ పద్ధతిలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. దేశంలోని ప్రముఖ సంస్థలైన సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐలతో బ్యారేజీల వద్ద నేల, పునాదుల పరీక్షలు చేయించామని, ఈ నివేదికలను ముంబై ఐఐటీ నిపుణులకు పంపించామని, వారి సూచనల మేరకు కొత్త డిజైన్లతో వచ్చే జూలై నాటికి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. 

వైఎస్సార్ హయాంలో రూ. 38,500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చిందని, దీనివల్ల ప్రాజెక్టు ఖర్చు రూ. 1.47 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దీనిపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. డీపీఆర్ పూర్తి కాకముందే పనులు ప్రారంభించి, కేబినెట్ అనుమతులు లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారని జస్టిస్ పినాకినీ చంద్ర ఘోష్ కమిషన్ కూడా ప్రాథమికంగా గుర్తించిందని మంత్రి వివరించారు.