V6 News

గల్ఫ్ గడ్డపై అమెరికా బేస్‌లు అవుట్? అమెరికా అండ అక్కర్లే: అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా

గల్ఫ్ గడ్డపై అమెరికా బేస్‌లు అవుట్? అమెరికా అండ అక్కర్లే: అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా

గల్ఫ్ దేశాల రక్షణ వ్యూహాల్లో దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన అమెరికా సైనిక స్థావరాలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న వైరం మధ్య ఈ సైనిక స్థావరాలు భద్రతను ఇచ్చే ఆస్తులు కాదని.. అవి తమ దేశాలకు ముప్పును తెచ్చిపెట్టేవని గల్ఫ్ దేశాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా స్థావరాల వల్ల తమ దేశాలకు రక్షణ కంటే ఇరాన్ వంటి శత్రు దేశాల నుంచి దాడుల ముప్పు ఎక్కువగా ఉందని కుండబద్దలు కొడుతూ పోస్ట్ పెట్టారు.

ఇటీవల ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులే ఈ చర్చకు ప్రధాన కారణం. యూఏఈలోని అల్ మిన్హాద్ సమీపంలో ఉన్న అమెరికా కమాండ్ సైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడం, అమెరికా బలగాలకు ప్రాణనష్టం వాటిల్లిందని ఇరాన్ క్లెయిమ్ చేయడం ఉద్రిక్తతలను పెంచింది. ఈ దాడులను యూఏఈ తన సొంత రక్షణ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఈ క్రమంలో యూఏఈని రక్షించడానికి ఇకపై అమెరికా అవసరం లేదని అబ్దుల్లా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. పరాయి దేశాల సైనిక స్థావరాలకు ఆశ్రయం కల్పించడం కంటే.. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడమే మేలని ఆయన వాదిస్తున్నారు.

కేవలం యూఏఈలోనే కాకుండా బహ్రెయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలను కూడా ఇరాన్ తన లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ దేశాలు రెండు శక్తుల మధ్య నలిగిపోతున్నాయి. ఒకవైపు అమెరికాతో దశాబ్దాల రక్షణ ఒప్పందాలు ఉన్నప్పటికీ.. ఇరాన్‌తో నేరుగా శతృత్వం పెంచుకోవడం వల్ల ఆర్థికంగా, భౌగోళికంగా నష్టపోవాల్సి వస్తుందని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గత పదేళ్లుగా ఈ దేశాలు తమ సొంత గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం వల్ల, ఇప్పుడు అమెరికా అండ లేకుండానే యుద్ధాన్ని తట్టుకోగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో మెుత్తానికి గల్ఫ్ దేశాలు ఆత్మనిర్భర రక్షణ విధానం వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే.. తమ గడ్డపై పరాయి దేశ జెండా ఉండకూడదనే భావన బలపడుతోంది. అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా లాంటి వారు లేవనెత్తిన ఈ అంశం రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని భారీగా తగ్గించే అవకాశం ఉంది. ఒకప్పుడు రక్షణ కవచాలుగా భావించిన అమెరికా బేస్ లు.. ఇప్పుడు శతృవుల నుంచి దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయనే వాస్తవం గల్ఫ్ దేశాల భద్రతా ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తోంది. మెుత్తానికి గల్ఫ్ దేశాలు అమెరికా సైనిక స్థావరాల వద్ద ప్రయోజనం కంటే వాటివల్ల జరుగుతున్న నష్టం, ఆర్థిక భారం గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నాయి.