- సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని రిక్వెస్ట్
- దౌత్యపరమైన ప్రతిపాదనలు అందుతున్నాయ్: ఇరాన్
- బుషెహర్‌పై అమెరికా క్షిపణి దాడులు
- బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ అటాక్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలతో మధ్యవర్తిత్వం నెరిపి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఖతార్, ఒమన్, స్విట్జర్లాండ్ రంగంలోకి దిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్దరించేందుకు ముందుకు రావాలని కోరాయి. ప్రస్తుతం ఇరు దేశాలు జరుపుకుంటున్న పరస్పర దాడులను పది రోజుల పాటు ఆపేయాలని అమెరికా, ఇరాన్ లకు పిలుపునిచ్చాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందాన్ని పునరుద్దరించాలని సూచించాయి.
ఇందుకోసం చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. గత నెలలోనే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇరుదేశాలు విరామం లేకుండా పరస్పరం తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడటంతో ఆ ఒప్పందం విఫలమైంది. అమెరికా ఇప్పటికీ దాడులు చేస్తున్నా దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ వెల్లడించినట్లు మరో వార్తా సంస్థ ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ పేర్కొంది. మీడియేటర్స్ ద్వారా తమకు ప్రతిపాదనలు అందుతున్నాయని.. ఈ విషయంలో దౌత్య వర్గాలు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని బఘాయ్ వివరించారు.
వైమానిక దాడులు తీవ్రం
ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష వైమానిక దాడులు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌లోని ఏకైక సివిలియన్ న్యూక్లియర్ ప్లాంట్ ఉన్న సౌత్ పోర్ట్ సిటీ బుషెహర్‌పై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అమెరికా బలగాలు బుషెహర్‌లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయని ఆ నగర గవర్నర్ మహమ్మద్ మొజఫ్ఫరీ వెల్లడించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ఐఆర్‌ఎన్‌ఏ' తెలిపింది.
ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు జరిపింది. సోమవారం ఉదయం బహ్రెయిన్ రాజధాని మనామాలో వైమానిక దాడి సైరన్లు మోగడంతో పాటు పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
జలసంధి విషయంలో తగ్గేదే లేదు
హార్మూజ్ జలసంధి వివాదంపైనా ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశ భద్రతను దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పింది. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, భద్రతకు భంగం కలిగించేలా హార్మూజ్ జలసంధిని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు.
తమ దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని.. ఇది ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలమార్గమన్నారు. దానికి భవిష్యత్తులో ముప్పు రాకుండా కాపాడుకుంటామని ఇరాన్ పేర్కొంది.
