హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఊహించని షాక్.. హైకోర్టు గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఊహించని షాక్.. హైకోర్టు గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న  హైడ్రా  కమిషనర్ రంగనాథ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో పోలీసుల తీరుతో ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. 

అసలు ఏం జరిగింది?

జులై 20న ఒక కేసుకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు.  కమిషనర్ తన వాహనంలో విఐపీలు, అధికారులు వెళ్లే గేట్ నంబర్ 6 ద్వారా కోర్టు ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. గేట్ నంబర్ 6 నుంచి లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

హైడ్రా కమిషనర్ అని చెప్పినప్పటికీ, భద్రతా సిబ్బంది నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు. గేట్ నంబర్ 6 గుండా రావాలంటే హైకోర్టు రిజిస్ట్రార్ ప్రొటోకాల్ అనుమతి తప్పనిసరి అని రంగనాథ్‌కు తేల్చి చెప్పారు. అంతేకాకుండా సాధారణ ప్రజలు, పిటిషనర్లు వచ్చే గేట్ నంబర్ 4 నుంచి మాత్రమే లోపలికి వెళ్లాలని సూచించారు.

దిద్దుబాటు లేని పరిస్థితుల్లో.. రంగనాథ్ గేట్ నంబర్ 4 వైపు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా సాధారణ ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసే ప్రాంతంలోనే ఆయన కారును నిలిపివేయాలని పోలీసులు తెలిపారు.

ఓ వైపు ఐపీఎస్ కేడర్ అధికారి, మరోవైపు సంచలన నిర్ణయాలతో వార్తల్లో ఉన్న హైడ్రా కమిషనర్  రంగనాథ్.. పోలీసుల సూచనతో పార్కింగ్ స్థలంలో కారు దిగి, సాధారణ పౌరుడిలా నడుచుకుంటూనే కోర్టు భవనంలోకి వెళ్లారు.