- ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రతిపాదించిన స్థలానికి సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయన రిపోర్ట్‌ను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 2026 ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పెద్దపల్లితో పాటు మామునూరు, ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం విమానాశ్రయాల పురోగతిపై కేంద్రం సమగ్ర వివరాలను వెల్లడించింది.
వరంగల్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి రన్‌వే, అప్రాన్, టాక్సీవే నిర్మాణాలతో పాటు కాంపౌండ్ వాల్ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినట్టు కేంద్రం తెలిపింది. అలాగే, కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ (2008) ప్రకారం కొత్త స్థలానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ఏఏఐ టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసిందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
