నల్గొండ, వెలుగు : నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం, బియ్యం నిల్వలు ఉంచారన్న ఆరోపణలతో పాటు, సీఎంఆర్ కు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం అందడంతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా డిండి మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్‌తో పాటు సూర్యాపేట మండలం గాంధీనగర్ సమీపంలో గల వజ్ర రైస్ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డుల పరిశీలన, ధాన్యం, బియ్యం నిల్వలు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మిల్లుల్లో ఉండాల్సిన నిల్వలకు, రికార్డుల్లో ఉన్న వివరాలకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అర్ధరాత్రి దాటే వరకు సోదాలు కొనసాగాయి. ఆఫీసర్ల ఆకస్మిక దాడులతో రెండు జిల్లాల పరిధిలోని రైస్ మిల్లుల యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
