బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై పది రోజులైనా పట్టించుకోరా?..బాన్సువాడ ఘటనపై విచారణ జరిపించాలి: హరీశ్ రావు

బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై పది రోజులైనా పట్టించుకోరా?..బాన్సువాడ ఘటనపై విచారణ జరిపించాలి: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ వికటించించి గర్భిణులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఘటన జరిగి పది రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.  ఘటనకు కారణాలేంటో తెలియలేదని, ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణమన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బాలింతలను, వారి కుటుంబ సభ్యులను హరీశ్​ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిజేరియన్ తర్వాత కాలం చెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడకేసిందని ఆరోపించారు.  ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లోనే చికిత్స పొందుతున్న మైనర్ బాలికను కూడా హరీశ్ రావు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలిక కుటుంబానికి కనీసం రూ.25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.