V6 News

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్?.. త్వరలోనే నిషేధం ఎత్తివేత.!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు  గ్రీన్ సిగ్నల్?.. త్వరలోనే నిషేధం ఎత్తివేత.!
  • రాష్ట్ర సర్కార్​ సూత్రప్రాయ నిర్ణయం
  • జనగణన ఉన్నప్పటికీ.. ఇబ్బంది లేకుండా బదిలీలు చేసేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల  సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ ఫైల్ పై సీఎం రేవంత్  రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి 2024లో చివరిసారిగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం... ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) ప్రక్రియ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం మధ్యేమార్గంగా ఆలోచిస్తోంది. జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీలు కల్పించినా.. వారు ఆ విధులను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టేలా ‘రిలీవింగ్ ఆప్షన్’ ఇచ్చే యోచనలో ఉంది. లేదా వారిని బదిలీల నుంచి మినహాయించడమా లేక తరువాత అవకాశం ఇవ్వడమా లాంటి ప్రత్యమ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్నది. దీంతో అటు కేంద్ర హోం శాఖ నిబంధనలను గౌరవిస్తూనే, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వేల మందికి పైగా ఉద్యోగులు ఈ జనాభా లెక్కల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కసరత్తును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. జూన్ 9వ తేదీ నాటికి మొదటి దశ జనగణన ముగియనున్న నేపథ్యంలో, ఈలోపే బదిలీల మార్గదర్శకాలను వెలువరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే బదిలీల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం ఈసారి కఠినమైన మార్గదర్శకాలను రూపొందించనుంది. 

రెండేళ్ల సర్వీసు పూర్తికాని వారికి నో

రెండేళ్ల సర్వీసు కూడా పూర్తికాని ఉద్యోగులను ఈ దఫా బదిలీ చేయరాదని, ఒకే కేడర్‌‌లో గరిష్టంగా 40 శాతానికి మించి బదిలీలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మానవీయ కోణంలో పలు కేటగిరీలకు ఈ బదిలీల్లో పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా స్పౌజ్  కేటగిరి, వితంతువులు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్  హార్ట్ సర్జరీ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా పోస్టింగ్  ఇచ్చేలా నిబంధనలు ఉండనున్నాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్  ఆదేశాల ప్రకారం 2027 వరకు బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆన్‌‌లైన్  ద్వారా కుటుంబ వివరాల నమోదు, ఇంటింటికీ వెళ్లి సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలు ఉన్నందున, బదిలీ అయిన ఉద్యోగులు ఆయా జిల్లాల్లోనే తమ విధులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.