V6 News

జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం... ప్యాకేజి ముట్టడంతోనే సీఎం రేవంత్ పై విమర్శలు: ఎమ్మెల్యే సంజయ్.

జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం... ప్యాకేజి ముట్టడంతోనే సీఎం రేవంత్ పై విమర్శలు: ఎమ్మెల్యే సంజయ్.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ ( ఏప్రిల్ 20 ) జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి నెలరోజుల కిందట బీఆర్ఎస్ నుంచి ప్యాకేజి అందిందని..అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నెలరోజుల క్రితం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను మెచ్చుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు ప్యాకేజీ అందడంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు.

జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని.. ఆయన చేరికను ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్. హరీష్ రావు జగిత్యాల సభకు రాకపోవడమే ఇందుకు ఉదాహారణ అని అన్నారు సంజయ్. తాను ఏనాడూ జీవన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించలేదని... జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు.

జగిత్యాల ప్రాంతం అభివృద్దే తనకు ముఖ్యమని... రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కాదని అన్నారు. జీవన్ రెడ్డి చేరికను బీఆర్ఎస్ లో చాలామంది వ్యతిరేకిస్తున్నారని అన్నారు. హరీష్ రావు లేకుండా లక్ష మందితో బీఆర్ఎస్ సభ జరగలేదని.. ఇవాళ జగిత్యాల సభ జరుగుతుంటే హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డి చేరిక హరీష్ రావుకు కూడా ఇష్టం లేదని అనడానికి ఇదే ఉదాహరణ  అని అన్నారు ఎమ్మెల్యే సంజయ్.