పీవీ సాహసంతో నిర్ణయాలు తీసుకున్నారు

పీవీ సాహసంతో నిర్ణయాలు తీసుకున్నారు
  • పీవీ, మా నాన్న చాలా సన్నిహితులు
  • బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
  • పీవీ, కాకా అనుబంధంపై వీడియో రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఎకానమిక్ రిఫామ్స్ తీసుకొచ్చి దేశాన్ని కాపాడడంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గొప్ప పాత్ర పోషించారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయనతో తన తండ్రి గడ్డం వెంకటస్వామికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వివేక్ బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో ప్రధాని పదవి చేపట్టిన పీవీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారో.. లేదోనన్న అనుమానం చాలా మందిలో ఉండేదని, కానీ ఆయన ఎకనమిక్ రిఫామ్స్ పై ఎంతో సాహసంతో నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. పీవీ, కాకా చాలా సన్నిహితులని గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఎకనామిక్ రిఫామ్స్ ప్రారంభించినప్పుడు మా నాన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా పని చేస్తుండేవారు. రిఫామ్స్ తో పేదలు ఇబ్బందులు పడతారని, అందువల్ల గ్రామీణాభివృద్ధి శాఖకు ఉన్నరూ.7 వేల కోట్ల బడ్జెట్ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కోరారు. పీవీ ఈ విషయాన్నివెంటనే గుర్తించారు. మంచి ప్రపోజల్ అని బడ్జెట్ ను పెంచారు. దాంతో రిఫామ్స్ వల్ల పేదలు ఎక్కడా ఇబ్బందులకు గురికాలేదు. మా నాన్న టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశంలోని టెక్స్టైల్ వర్కర్స్ సంక్షేమం కోసం రూ.125 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరితే పీవీ కేటాయించారు” అని వివేక్ వివరించారు. పీవీ సూచన మేరకు తన తండ్రి ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర్లోని తమ ఇంట్లో ఉగాది పండుగను ఏటా నిర్వహించేవారని, అప్పటి తెలుగు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కేబినెట్ మంత్రులు వచ్చి ఉగాది పచ్చడి తీసుకుని, భోజనం చేసి వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. పీవీ మేధావి అని, చాలా భాషలు మాట్లాడతారని ఆయన ఈ తరానికి స్ఫూర్తి అని వివేక్ కొనియాడారు.

పాలన నడవట్లే..సీఎం ప్రగతి భవన్లో ఉండట్లే