వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త : సీఎం రేవంత్​ రెడ్డి

వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త  : సీఎం రేవంత్​ రెడ్డి
  • ట్విట్టర్​ టిల్లు ఉద్దెర పెట్టిపోయిన బకాయిలు మేం కడ్తున్నం : సీఎం రేవంత్​ రెడ్డి
  • రాజ్యాంగంపై మోదీ, కేసీఆర్ ఆలోచన ఒక్కటేనని కామెంట్​
  • సిరిసిల్ల జనజాతర సభలో ప్రసంగం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఇప్పటికే తెలంగాణకు పట్టిన పీడను వదిలించుకున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడ (కేటీఆర్ ను) కూడా వదిలిస్తానని సీఎం రేవంత్​రెడ్డి​అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి మిడ్ మానేరు ముంపు బాధితులను కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు మద్దతుగా సిరిసిల్లలో  నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై, మాట్లాడారు. ‘బతుకమ్మ చీరలకు సంబంధించి కేటీఆర్  రూ.275 కోట్ల బకాయిలు పెట్టిండు.

వాళ్ల తండ్రి కేసీఆర్ రూ.40 వేల కోట్లు రాష్ట్రానికి ఉద్దెర పెట్టిపోయిండు. ఈ బకాయిలు కూడా మేమే కట్టాల్సి వస్తున్నది’ అని అన్నారు. నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ విడుదల చేసే బాధ్యత తనదేనని సీఎం చెప్పారు. ఇప్పటికే  మొదటివిడత రూ.50 కోట్లు రిలీజ్ చేశామని తెలిపారు. ‘ కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ టిల్లు అన్ని మాట్లాడుతడు. కానీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుంటే  మాత్రం నోరుమెదపడు

’ అని కేటీఆర్​పై సెటైర్​వేశారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగాల సమితి అని ఎద్దేవా చేశారు.‘ వినోద్ రావు ఇంట్లకేంచి ఎల్లుతలేడు. ప్రచారానికి వస్తలేడు. కరీంనగర్ బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించేందుకే ఇట్ల చేస్తుండు’ అని ఆరోపించారు. 

మోదీది, కేసీఆర్​ది ఒక్కటే ఆలోచన..  

రాజ్యాంగంపై మోదీ, కేసీఆర్‌‌‌‌ ఆలోచన ఒక్కటేనని సీఎం రేవంత్​ఆరోపించారు. ‘రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మోదీ ఆలోచన చేస్తుంటే కేసీఆర్, ట్విట్టర్ టిల్లు (కేటీఆర్ ) ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన  కేసీఆర్ కు కూడా ఉంది. 2022 ఫిబ్రవరిలోనే  కేసీఆర్  రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని మాట్లాడిండు’ అని అన్నారు.

బీజేపీ అధికారం కావాలని అడుగుతలేదని, 400 సీట్లు కావాలని అడుగుతోందని, అన్ని సీట్లు వస్తే బీజేపీ కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ,ఎస్టీ, బీసీ ల రిజర్వేషన్లు  లేకుండా చేస్తుందని ఆరోపించారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. 

అపరమేధావి, అరగుండు మేధావి ఒరగబెట్టిందేమీలేదు

కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఒకరేమో అపరమేధావి (వినోద్​ కుమార్​), మరొకరేమో అరగుండు మేధావి (బండి సంజయ్) అని, వీరిద్దరు గతంలో ఎంపీలుగా ఒరగబెట్టిందేమీలేదని రేవంత్​రెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం వీళ్లు రూపాయి కూడా తీసుకు రాలేదని చెప్పారు.

ఇప్పటికే ఎంపీలుగా ఇద్దరికి అవకాశం ఇచ్చారని, ఈసారి విద్యావంతుడు, వెలిచాల రాజేందర్​కు చాన్స్​ ఇవ్వాలని ప్రజలను కోరారు. రాజేందర్ ఇంట్లకెళ్లి ఓ రూపాయి ఖర్చుపెట్టే మనిషే కానీ.. ఎవరిదీ తినేరకం కాదని రేవంత్ చెప్పారు.