నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నరు : డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నరు  : డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

కరీంనగర్, వెలుగు: నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించిన బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని కార్ఖానాగడ్డ గాంధీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. 

కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడా లేదన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి పిరికిపందలా బయటకు వచ్చిన వీరసావర్కర్ బీజేపీకి దేవుడయ్యాడని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన చరిత్ర అమిత్ షాది అని విమర్శించారు. భవిష్యత్ లో మహాత్మాగాంధీ పేరును పూర్తిగా తొలగించి కొత్త పార్లమెంటుకు వీరసావర్కర్ పేరు లేదా నరేంద్ర మోదీ పేరును పెట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు.

 మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌‌‌‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు మాట్లాడారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, ఆర్టీఏ మెంబర్ రాహుల్ గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండీ తాజ్, సత్యప్రసన్న రెడ్డి, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.  

గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా..

రామడుగు, వెలుగు: గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం కిష్టాపూర్ సర్పంచ్ వేల్పుల మల్లేశం, వార్డు సభ్యులు వేల్పుల రవి, రాజేశ్, మంగళారపు లచ్చయ్య కాంగ్రెస్‌‌‌‌లో చేరగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్​ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.