భయపడకండి.. పారిపోకండి: రాహుల్​ గాంధీపై మోదీ విమర్శ

భయపడకండి.. పారిపోకండి: రాహుల్​ గాంధీపై మోదీ విమర్శ

క్రిష్ణానగర్ (బెంగాల్​): ఓటమి భయంతో కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​గాంధీ అమేథీ నుంచి రాయ్​బరేలీకి పారిపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘భయపడకండి.. పారిపోకండి..’ అంటూ చురకలంటించారు. రాహుల్​గాంధీ కొత్త సీటు వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని అన్నారు. బెంగాల్​లోని బర్ధమాన్​ దుర్గాపూర్​, క్రిష్ణానగర్​లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఆధిక్యం ఆల్​టైమ్​ కనిష్టానికి చేరుకుంటుందని చెప్పారు. కనీసం50 సీట్లన్నా గెల్చుకోవాలని ఆ పార్టీ కష్టపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​కు అధికారమిస్తే బుజ్జగింపు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కొని ‘జిహాదీ ఓటు బ్యాంకు’ (ముస్లింల)కు ఇస్తుందని మోదీ ఆరోపించారు. 

కాంగ్రెస్​ ఓటమి ఖాయమైపోయింది

కాంగ్రెస్ ఓటమి ఖాయమైపోయిందని చెప్పడానికి ఒపీనియన్​ పోల్స్​, ఎగ్జిట్​పోల్స్​ అక్కర్లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్​ ఓటమి గురించి ఇటీవల పార్లమెంట్​లో మాట్లాడా. ఆ పార్టీ సీనియర్​ లీడర్ లోక్​సభ సీట్​ను వదులుకొని రాజస్థాన్​నుంచి రాజ్యసభకు ఎంటర్ అయినప్పుడే వారి ఓటమి ఖాయమైపోయింది’ అని సోనియాగాంధీని ఉటంకిస్తూ మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాహుల్​గాంధీ  ఓటమి భయంతో రాయ్​బరేలి​నుంచి పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 15 సీట్లు గెలిచి తృణమూల్​ కాంగ్రెస్, 50 లోపు సీట్లు గెలిచి కాంగ్రెస్​.. లెఫ్ట్​ పార్టీలతో కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని చెప్పారు. 

లిఖితపూర్వకంగా చెప్పగలరా..? 

అధికారంలోకి వస్తే మతపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించబోమని లిఖితపూర్వకంగా చెప్పగలరా? అని కాంగ్రెస్​కు మోదీ సవాల్​ విసిరారు. ‘దేశంలో మతపరంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగం చెబుతోంది. కానీ..బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు దళితులు, ఓబీసీలపై కాంగ్రెస్​ కోపంగా ఉన్నది. వారి రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది’ అని ఆరోపించారు. 

బెంగాల్​లో సెకండ్​ క్లాస్​ సిటిజన్లుగా హిందువులు

రాష్ట్రంలో టీఎంసీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ విమర్శించారు. బెంగాల్​లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేసిందని మండిపడ్డారు. హిందువులను భగీరథ నదిలో పడేస్తామని ముర్షీదాబాద్​ జిల్లాలో టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్​ కబీర్​ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘ఇవేం రాజకీయాలు? టీఎంసీకి మానవత్వం కంటే బుజ్జగింపు రాజకీయాలే ఎక్కువా? రామ మందిరం.. శ్రీరామ నవమి శోభాయాత్ర..జై శ్రీరామ్​ నినాదాలతో వారికి సమస్యలున్నాయి’ అని మండిపడ్డారు. స్కూల్​సర్వీస్​ కమిషన్​ స్కామ్​ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన నిజమైన టీచర్​ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్​ సెల్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  వివిధ స్కామ్​లలో బెంగాల్​ ప్రజలను దోచుకున్నవారిని వదిలిపెట్టబోమని, ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.