ఆలయ కమిటీ సభ్యుల బెదిరింపులు.. మనస్తాపంతో ఎస్టీ మహిళ ఆత్మహత్య

ఆలయ కమిటీ సభ్యుల బెదిరింపులు.. మనస్తాపంతో ఎస్టీ మహిళ ఆత్మహత్య
  •   పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన
  •     ఆలయ నిర్మాణానికి అడ్డుగా ఉన్నారని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని 
  • ఆలయ కమిటీ వేధింపులు  బాధితురాలి కుటుంబ సభ్యులపైనా దాడి

పెద్దపల్లి, వెలుగు: ఆలయ కమిటీ సభ్యులు వేధించడంతో పాటు తన కుటుంబంపై దాడి చేయడంతో ఓ ఎస్టీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముత్తారం మండల కేంద్రానికి చెందిన ఓ భూస్వామి.. 40 ఏండ్ల కింద ఎరుకలి సామాజికవర్గానికి చెందిన కేతిరి సారయ్య కుటుంబ సభ్యులకు కొంత భూమి దానంగా ఇచ్చాడు. ఆ భూమిలో సారయ్య గుడిసె వేసుకొని తన భార్య లక్ష్మి (50), కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. పక్కనే పందుల పెంపకం కోసం ఓ గూడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రానికి చెందిన రామాలయ నిర్మాణ కమిటీ సభ్యులు లక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్న స్థలంలో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. దీంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లక్ష్మి కుటుంబాన్ని బెదిరించారు. 

ఈనెల 2న కమిటీ సభ్యులతో పాటు మరికొందరు గ్రామస్తులు లక్ష్మి ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి.. పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను గోదావరిఖనిలోని హాస్పిటల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్‌ హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్‌మెంట్‌ పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆమె సామాజికవర్గానికి చెందిన వారు, ప్రజాసంఘాల నాయకులు లక్ష్మి డెడ్‌బాడీతో గ్రామానికి చేరుకున్నారు. వివాదం నెలకొన్న స్థలంలోనే లక్ష్మి డెడ్‌బాడీని పెట్టి ఆందోళనకు దిగారు. ఆమె మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని,  ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్‌  చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతురాలి భర్త సారయ్య గతంలోనే ఇచ్చిన ఫిర్యాదుతో నారాయణరెడ్డి, కుమార్, రాజయ్య, సతీశ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఊరవతలకు పొమ్మంటున్నరు..

మాది తక్కువ జాతి అని, పందులను పెంచుకుంటున్నామని ఊరవతలకు పంపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మృతురాలి కూతురు శారద వాపోయింది.   తన తల్లి ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేసింది.