న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్‌కు మోడీ సర్కార్ తలొగ్గింది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ కోరుకున్న చోటే చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం దగ్గరకు తాము వెళ్లబోమని.. ప్రభుత్వమే మా దగ్గరకు రావాలని సీజేపీ డిమాండ్ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సీజేపీ ప్రతినిధులతో మరో దఫా చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సీజేపీ ప్రతినిధులు కోరుకున్న చోటే చర్చలకు ప్రభుత్వం రెడీ అని చెప్పారు. సీజేపీ ప్రతినిధులకు కావాల్సినంత సమయం ఇస్తామన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, తాను చర్చల్లో పాల్గొంటామని జితేంద్ర సింగ్ తెలిపారు. నా కార్యాలయంలోనైనా.. జేపీ నడ్డా నివాసంలో గానీ.. లేదా సీజేపీ కోరుకున్న వేదికలో ఎక్కడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం (జులై 23) మధ్యాహ్నం నుంచి చర్చల కోసం ప్రభుత్వం సీజేపీకి నాలుగుసార్లు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. దయచేసి చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారం గురించి మాట్లాడాలని సీజేపీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
చర్చల ప్రతిపాదన తిరస్కరించిన సీజేపీ:
నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం చర్చల ప్రతిపాదనను తిరస్కరించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పునరుద్ఘాటించింది. ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే కేంద్రంతో చర్చల్లో పాల్గొంటామని తేల్చిచెప్పింది. అది కూడా.. చర్చల కోసం తాము ప్రభుత్వం దగ్గరకు వెళ్లమని.. ప్రభుత్వమే మా దగ్గరకు రావాలని సీజేపీ షరతు విధించింది. కాగా, కేంద్రంతో సీజేపీ తొలి దఫా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
