బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో షాక్.. ఆస్తి వేలం కేసులో జోక్యానికి నిరాకరణ!

 బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో షాక్.. ఆస్తి వేలం కేసులో జోక్యానికి నిరాకరణ!


టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  యూనియన్ బ్యాంక్ తో  సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వేలం వివాదంలో ఆయనకు గట్టి  ఎదురుదెబ్బ తగిలింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవసరం కనిపించడం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బండ్ల గణేశ్‌కు న్యాయపరంగా మరో కీలక ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని 'మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ యూనియన్ బ్యాంక్ నుండి భారీగా రుణాలు తీసుకుంది. ఈ రుణాల కోసం బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు. అయితే, కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (CIRP) సమయంలో బ్యాంక్ 'సర్ఫేసీ' (SARFAESI) చట్టం కింద చర్యలు చేపట్టి, తాకట్టులో ఉన్న ఆస్తిని బహిరంగ వేలంలో వేసి స్వాధీనం చేసుకుంది.

ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (DRT)ని ఆశ్రయించారు. అక్కడ వేలాన్ని రద్దు చేస్తూ, కొనుగోలుదారుడికి వడ్డీతో డబ్బులిచ్చి ఆస్తిని గణేష్ కుటుంబానికి అప్పగించాలని ఆర్డర్ ఇచ్చింది. కానీ యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా.. డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేసి బ్యాంక్ చర్యలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చంది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు.. 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ద్వారా బ్యాంక్‌కు సుమారు రూ.129.02 కోట్ల బకాయిలు పూర్తిగా చెల్లించామని చెప్పారు అందుకు సెటిల్‌మెంట్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటికే జరిగిన వేలాన్ని చెల్లుబాటు అయ్యేలా ఉంచడం న్యాయసమ్మతం కాదని వాదించారు. మరోవైపు యూనియన్ బ్యాంక్‌తో పాటు వేలంలో ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

అయితే అన్ని వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేస్తూ  బండ్ల గణేశ్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో బ్యాంక్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పే కొనసాగనుంది. సినీ రంగంలోనే కాకుండా వ్యాపార, ఆర్థిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం కీలక మలుపుగా మారింది. దీంతో వేలంలో పోయిన ఆస్తిపై బండ్ల గణేష్‌కు ఆశలు గల్లంతయ్యాయి.