నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు.
న్యాయం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఎంపీ తీవ్రంగా ఖండించారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపించడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర సర్కార్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కేంద్రానికి విద్యార్థులు, ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
