హైదరాబాద్, వెలుగు: నీట్ పరీక్షల నిర్వహ ణలో వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, దేశ విద్యావ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
బుధవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తదితర సంఘాల రాష్ట్ర నేతలు బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరుస పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే వీబీఎస్ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టి.నాగరాజు (ఎస్ఎఫ్‌ఐ), కె. మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ ఎఫ్), వెంకట్ స్వామి (ఎన్‌ఎస్‌యూఐ), పల్లె మురళి (ఏఐఎఫ్‌డీఎస్) పాల్గొన్నారు.
