హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలో చదువుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్. జులై 24న ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ జులై 24న వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో శుక్రవారం (జులై 24) ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. త్వరలోనే వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
జులై 24న విద్యాసంస్థలు బంద్
నీట్ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, దేశ విద్యావ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఎ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్ఎఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ తదితర సంఘాల రాష్ట్ర నేతలు బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరుస పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే వీబీఎస్ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు.
