పాస్‌వర్డ్ మర్చిపోయారా? సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసే కొత్త ఫీచర్

పాస్‌వర్డ్ మర్చిపోయారా? సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసే కొత్త ఫీచర్

గూగుల్ తన వినియోగదారుల కోసం మరో వినూత్న సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పాస్‌వర్డ్ మర్చిపోయినా, ఫోన్ ల్యాప్‌టాప్ అందుబాటులో లేకపోయినా సెల్ఫీ వీడియో సాయంతో గూగుల్ అకౌంట్‌ను తిరిగి యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తున్న గూగుల్.. ఇది పాస్‌కీలు, రికవరీ కాంటాక్ట్స్ లాంటి ఇప్పటికే ఉన్న అకౌంట్ రికవరీ పద్ధతులకు అదనంగా లభించనుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా మీ గూగుల్ అకౌంట్‌కు ఇది అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాలి. ఇందుకోసం Google Accountలోని Security Settingsలోకి వెళ్లి సెల్ఫీ వీడియో ఆప్షన్ కనిపిస్తుందో చూడాలి. మీ అకౌంట్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే, సెటప్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసే సమయంలో గూగుల్ ఇచ్చే సూచనలను అనుసరించాలి. మొబైల్ లేదా కంప్యూటర్ కెమెరా వైపు నేరుగా చూడాలి. స్క్రీన్‌పై చూపించే సూచనల ప్రకారం తలను స్వల్పంగా కదిలించాలి. దీంతో కెమెరా మీ ముఖాన్ని వివిధ యాంగిల్స్ లో రికార్డ్ చేస్తుంది. ఈ వీడియోను గూగుల్ ఎన్క్రిప్ట్ చేసి మీ అనుమతితోనే అకౌంట్‌లో భద్రపరుస్తుంది.

భవిష్యత్తులో మీరు పాస్‌వర్డ్ మర్చిపోయినా, మీ సాధారణ డివైస్ అందుబాటులో లేకపోయినా.. గూగుల్ Selfie Verification ఆప్షన్‌ను చూపిస్తుంది. అప్పుడు మరోసారి కొత్త సెల్ఫీ వీడియో రికార్డ్ చేయాలి. మళ్లీ కొన్ని సులభమైన తల కదలికలు చేయాల్సి ఉంటుంది. మీరు తాజాగా రికార్డ్ చేసిన వీడియోను, ముందుగా సేవ్ చేసిన సెల్ఫీ వీడియోతో గూగుల్ పోల్చి ఒకే వ్యక్తి అని నిర్ధారించిన తర్వాత మాత్రమే అకౌంట్ యాక్సెస్ ఇస్తుంది.

ఈ ఫీచర్‌లో గోప్యతకు కూడా గూగుల్ ప్రాధాన్యం ఇచ్చింది. సెల్ఫీ వీడియో పూర్తిగా యూజర్ అనుమతితోనే స్టోర్ చేయబడుతుంది. అది ఎన్క్రిప్ట్ చేయబడి భద్రంగా ఉంటుంది. వినియోగదారు కోరుకుంటే ఎప్పుడైనా Google Account Settings ద్వారా ఆ వీడియోను తొలగించవచ్చు. అలాగే ఈ వీడియోను అకౌంట్ లాగిన్ కోసం మాత్రమే ఉపయోగిస్తామని, ప్రత్యేకంగా అనుమతి ఇస్తే తప్ప ఫేస్ రికగ్నిషన్ లేదా ఇతర AI టెక్నాలజీల అభివృద్ధికి వినియోగించబోమని గూగుల్ స్పష్టం చేసింది.

నకిలీ ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో మోసం జరగకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థను కూడా గూగుల్ అమలు చేసింది. లైవ్ వీడియోను ముందుగా సేవ్ చేసిన వీడియోతో పోల్చడంతో పాటు, రియల్ టైమ్‌లో తల కదలికలను గుర్తించడం, అనుమానాస్పద లాగిన్ ప్రయత్నాలను విశ్లేషించడం వంటి భద్రతా చర్యలు ఇందులో ఉన్నాయి. అండర్‌ఏజ్‌గా అనుమానించే వినియోగదారులు ఈ ఫీచర్‌లో నమోదు చేసుకోలేరని కూడా గూగుల్ తెలిపింది. మొత్తం మీద అకౌంట్ రికవరీని మరింత సేఫ్ అండ్ ఈజీ చేయడమే ఈ కొత్త సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ లక్ష్యమని గూగుల్ వెల్లడించింది.