అదానీ దూకుడు: సొంత విమాన సంస్థకు ప్లాన్స్.. ఇండిగో, ఎయిర్ ఇండియాకు సవాల్

అదానీ దూకుడు: సొంత విమాన సంస్థకు ప్లాన్స్.. ఇండిగో, ఎయిర్ ఇండియాకు సవాల్

భారత ఏవియేషన్ రంగంలో మరో సంచలన పరిణామానికి తెరలేచే అవకాశం కనిపిస్తోంది. అదానీ గ్రూప్‌ సొంత విమానయాన సంస్థను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ఆపరేటర్లు ఏదైనా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌లో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండకూడదనే నిబంధనను సడలించాలని మోడీ ప్రభుత్వాన్ని అదానీ గ్రూప్ కోరినట్లు సమాచారం.

ఈ నిబంధన తొలగిస్తే.. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ నేరుగా దేశీయ విమానయాన దిగ్గజాలు ఇండిగో, ఎయిర్ ఇండియాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత దేశీయ విమాన ప్రయాణ మార్కెట్‌లో ఇండిగో, ఎయిర్ ఇండియా కలిపి దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కొత్తగా బలమైన సంస్థ రంగంలోకి వస్తే పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రావచ్చని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూప్ ఇప్పటికే విమానయాన రంగంలో భారీగా విస్తరించింది. దేశవ్యాప్తంగా 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఈ సంస్థకు పైలట్ శిక్షణా కేంద్రాలు, విమానాల నిర్వహణ–మరమ్మతు సేవలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లోనూ కార్యకలాపాలు ఉన్నాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌కు 74 శాతం నియంత్రణ వాటా ఉంది.

అదానీ ఎయిర్‌లైన్ ఆలోచన వెనుక మరో వ్యూహాత్మక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్‌తో కలిసి దేశంలో విమానాల తయారీకి సంబంధించిన ప్రణాళికలను గ్రూప్ పరిశీలిస్తోంది. అయితే ఎంబ్రేయర్ విమానాలను కొనుగోలు చేయడానికి దేశీయ ఎయిర్‌లైన్ల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో.. సొంత ఎయిర్‌లైన్ ఉంటే ఈ తయారీ ప్రాజెక్టుకు సపోర్ట్ లభిస్తుందని అదానీ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే విమానాశ్రయాన్ని నిర్వహించే సంస్థే ఎయిర్‌లైన్‌ను కూడా నడపడం వల్ల ప్రయోజనాల సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయాలను నిర్ణయించే కీలకమైన స్లాట్‌ల కేటాయింపులో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తవచ్చని చెబుతున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక రక్షణ చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ కార్యకలాపాలను వేర్వేరుగా నిర్వహించడం, వాణిజ్య రహస్యాల పరిరక్షణ, కీలక మేనేజ్‌మెంట్ సిబ్బంది ఒకే సంస్థలో ఉండకుండా నిబంధనలు తీసుకురావడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. భారత విమానయాన రంగంలో పోటీ పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులు జరిగితే, అదానీ గ్రూప్ కొత్త ఎయిర్‌లైన్ దేశీయ ఆకాశంలో మరో పెద్ద ఏవియేషన్ కంపెనీగా మారే అవకాశం ఉంది.