న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులు, ప్రొఫెసర్లకు సూచించింది. చట్టవిరుద్ధమైన సమావేశాలలో పాల్గొనడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని.. తద్వారా విద్యార్థుల విద్యా, వృత్తి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. విద్యార్థులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు డీయూ గురువారం (జులై 23) ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ప్రియమైన విద్యార్థులు, అధ్యాపకులారా.. మీ భద్రత మాకు ముఖ్యం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కఠినంగా నియంత్రించబడే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ఏవైనా చట్టవిరుద్ధమైన సమావేశాలు లేదా ప్రదర్శనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
ఇలాంటి సమావేశాలలో పాల్గొనడం విద్యార్థుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం. విద్యా పురోగతి, వృత్తిపరమైన అవకాశాలపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. అందువల్ల విద్యార్థులందరూ జంతర్ మంతర్‌కు దూరంగా ఉండాలని.. తమ భద్రతకు, చట్ట ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని హెచ్చరించింది. ఆందోళనలకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నీట్ 2026 పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026, జులై 20న సీజేపీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సీజేపీ చేపట్టిన ఈ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసుల బలప్రయోగంలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై పోలీసుల అమానుష దాడికి నిరసనగా సీజేపీ జులై 24న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
