హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లు, పీజీ మెడికల్ స్టూడెంట్లకు స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ షాకిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం స్టైఫండ్ చెల్లింపుల వివరాలను అఫీషియల్ వెబ్ సైట్లలో పొందుపరచని దేశంలోని7 మెడికల్ కాలేజీలకు ఒక్కో దానికి రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. ఇకముందు కూడా చెల్లించకపోయినా.. వెబ్ సైట్లలో వివరాలు వెల్లడించకపోయినా కొత్త అడ్మిషన్లు నిలిపివేయడంతో పాటు పర్మిషన్లు పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఆ 7 కాలేజీలు ఇవే....
ఫైన్ పడిన కాలేజీల జాబితాలో ఏపీలోని ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండటం గమనార్హం. ఒంగోలుతో పాటు కర్నాటకకు చెందిన ఆకాశ్ ఇనిస్టిట్యూట్ (బెంగళూరు), జార్ఖండ్‌లోని దుమ్కా మెడికల్ కాలేజ్, రాజస్తాన్‌లోని బాడ్మేర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్కేడీఎఫ్ మెడికల్ కాలేజ్ (భోపాల్), యూపీలోని ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (లక్నో), హర్యానాకు చెందిన పీటీ బీడీ శర్మ పీజీ ఇనిస్టిట్యూట్ (రోహ్‌తక్) లిస్టులో ఉన్నాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ తక్షణమే స్టైపెండ్ రూల్స్ పాటించి, పారదర్శకంగా వ్యవహరించాలని.. లేకుంటే కఠిన శిక్షలు తప్పవని ఎన్ఎంసీ తేల్చిచెప్పింది.
